హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన డ్యామ్, గ్యాలరీలు, వాక్‌వే, స్పిల్‌వే, ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ సంజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ డ్యాం రీహబిలిటేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులను పటిష్ఠపరిచేందుకు చేయాల్సిన పనులపై నివేదిక అందజేశాక నిధులు మంజూరు అవుతాయన్నారు.
కృష్ణా నదీ జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. సాగర్ డ్యాం పటిష్ఠతకు ఇరిగేషన్ ఆఫీసర్లు గతంలోనే రూ. 160 కోట్లతో ప్రపోజల్స్ పంపారని, పరిశీలన అనంతరం తమ రిపోర్ట్‌ను కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ జాయింట్ కమిషనర్ మనోజ్‌కుమార్, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ డీఈ అజయ్ యాదవ్, స్థానిక ఎస్‌ఈ శ్రీధర్‌రావు, ఈఈ మల్లికార్జునరావు, డీఈ శ్రీనివాస్, జేఈ రాజేశ్, ఏఈలు సత్యనారాయణ, కృష్ణయ్య పాల్గొన్నారు.