మెదక్ కు సీఏంఎస్ మంజూరు

మెదక్ కు సీఏంఎస్ మంజూరు
  • మెదక్ కు సీఏంఎస్ మంజూరు
  • పాత డీఎంహెచ్ వో ఆఫీస్ లో ఏర్పాటు
  • ఇక సంగారెడ్డి వెళ్లాల్సిన పనిలేదు

మెదక్, వెలుగు: మెదక్ జిల్లాకు సెంట్రల్ మెడిసిన్ స్టోర్ (సీఏంఎస్) ఇటీవల మంజూరైంది. జిల్లాలోని సర్కార్ దవాఖానాలకు అవసరమైన అన్ని రకాల మెడిసిన్స్, ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు ఇక్కడే లభిస్తాయి. దీంతో ఇక నుంచి మెడిసిన్స్ కోసం సంగారెడ్డికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మెదక్ పట్టణంలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, నర్సాపూర్ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, తూప్రాన్, రామాయంపేట, కౌడిపల్లిలో కమ్యూనిటీ ఆస్పత్రులు,ఆయా మండలాల పరిధిలో 19 పీహెచ్ సీలు, మెదక్ పట్టణంలో ఒక అర్బన్ పీహెచ్ సీ ఉన్నాయి. 

ఆయా ఆస్పత్రులకు దాదాపు 400 రకాల మెడిసిన్స్ అవసరం ఉంటాయి. గతంలో అవసరమైన మెడిసిన్స్ కోసం ఇండెంట్ పెడితే సంగారెడ్డిలో ఉన్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుంచి సప్లై అయ్యేవి. జిల్లాల పునర్ విభజనతో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటకు వేర్వేరుగా డీఎంహెచ్ వో ఆఫీస్ లు ఏర్పాటయ్యాయి. కానీ మెడిసిన్ స్టోర్లు ఏర్పాటు కాలేదు. కొన్నాళ్ల కింద సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సీఏంఎస్ మంజూరు కాగా సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మెదక్ జిల్లాకు కూడా సీఏంఎస్ మంజూరైంది.

ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న పాత డీఎంహెచ్ వో ఆఫీస్ బిల్డింగ్ లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మెడిసిన్స్ భద్ర పరిచేందుకు అవసరమైన సామగ్రితో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ కూడా వచ్చాయి. అన్ని రకాల మెడిసిన్స్ తో పాటు, ఇంజెక్షన్లు, పాము, తేలు, కుక్క కాటుకు సంబంధించి న వ్యాక్సిన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సీఏంఎస్ నుంచి జిల్లాలోని ఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు మెడిసిన్స్ సప్లై చేసేందుకు ఒక వెహికల్, గ్రేడ్1, గ్రేడ్ 2 ఫార్మాసిస్ట్ లు, ఇద్దరు ప్యాకర్స్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం కానున్నారు.

త్వరలోనే సెంట్రల్ మెడిసిన్ స్టోర్ వినియోగంలోనికి రానుంది. ఇప్పటివరకు ఆయా ఆస్పత్రులకు అవసరమైన మెడిసిన్స్ ఉమ్మడి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి సప్లై అయ్యేవి. త్వరలోనే మెదక్ పట్టణంలో సీఏంఎస్ ప్రారంభం కానుండడంతో ఇబ్బందులు తప్పనున్నాయి.