టీటీడీకి, వక్ఫ్ భూములకు తేడా తెలియదా?

టీటీడీకి, వక్ఫ్ భూములకు తేడా తెలియదా?
  • ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్​
  • వక్ఫ్ భూములు పేద ముస్లింలకు చెందాలన్నదే కేంద్ర ఉద్దేశం
  • పాతబస్తీ వాసులారా.. ఇకనైనా మేల్కొండి

హైదరాబాద్ , వెలుగు: మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ అసలు రంగు  బయటపడిందని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెబుతున్న మోదీ సర్కారు.. వక్ఫ్ బోర్డ్ లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేంటంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై సంజయ్​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ‘‘వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూములకు సంబంధించిన వ్యవహారమే. మీరు ప్రార్థించే మసీదు కాదు.  టీటీడీకి,  వక్ఫ్ బోర్డు పేరుతో సాగిస్తున్న  భూముల దందాకు లింకు పెడతావా?’’ అంటూ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్​ ఒక ప్రకటన విడుదల చేశారు.  ఒవైసీ.. కలియుగ దైవానికి, వక్ఫ్ భూములకు తేడా తెలియని అజ్ఞాని అని విమర్శించారు. వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు మాత్రమే దక్కాలన్నదే  కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని, అందుకే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చిందని తెలిపారు. విరాళాలతో టీటీడీ.. హిందూ ధార్మిక సంస్థలకు సాయం చేస్తున్నది తప్పా.. ఏనాడూ ప్రజల ఆస్తులను కబ్జా చేసుకోలేదని చెప్పారు. 

‘ఒవైసీ దృష్టిలో భగవంతుడంటే వ్యాపారమే. వేల ఎకరాలను కబ్జా చేసిండు. కాలేజీలు, ఆసుపత్రులు కట్టి వేల కోట్లు దోచుకుంటుండు. చివరికి చెరువులను, శిఖం భూములను కూడా కబ్జా చేసి, భవంతులు కట్టుకున్నడు” అని ఆరోపించారు.  ‘‘ఒవైసీ మాటలు నమ్మి దశాబ్దాలుగా మోసపోతున్న పాతబస్తీ ముస్లిం సోదరులకు నేను చెప్పేదొక్కటే.. ఇకనైనా వాస్తవాలు  తెలుసుకోండి. మజ్లిస్​ను గెలిపిస్తున్నా ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందలేదు?  సైబరాబాద్, న్యూ సిటీలా ఎందుకు కాలేదు? కనీసం మెట్రో ఎందుకు రాలేకపోయింది? మీ ఓట్లతో గెలిచిన ఒవైసీ కుటుంబం లక్షల కోట్లు ఎట్లా దోచుకుంటున్నది? ఒక్కసారి ఆలోచించండి’’ అని కోరారు.  

బీఆర్ఎస్​ నేతలు  బహిరంగ క్షమాపణ చెప్పాలి

తాను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బందిపడతారని అసదుద్దీన్ ఒవైసీ  చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు.  ‘‘తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన కుటుంబ పార్టీ (బీఆర్ఎస్)తో పదేండ్లు అంటకాగిన  దేశద్రోహ(ఎంఐఎం) పార్టీ ఈ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.  ఇప్పుడు దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రాజ్యమేలుతున్న నకిలీ గాంధీ వారసుల పార్టీ (కాంగ్రెస్)ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్నది. 

ఒవైసీ సోదరుల శీల పరీక్ష గడువు ముగిసినట్లుంది. కల్వకుంట్ల కుటుంబం ఇకనైనా సిగ్గుతో తలదించుకోవాలి. రాజకీయ మతోన్మాదంతో రగిలిపోతూ జన్మనిచ్చిన తల్లికే వెన్నుపోటు పొడుస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న ఎంఐఎంతో అంటకాగినందుకు ముక్కు నేలకురాసి యావత్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని బండి సంజయ్​ డిమాండ్​ చేశారు.