బషీర్ బాగ్/శంషాబాద్, వెలుగు: దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హిందు ఆధ్యాత్మిక సేవ మేళాకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ సంస్కృతిని దెబ్బతీసేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, వీరిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేళాను చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ సందర్శించాలన్నారు. అనంతరం శంషాబాద్‌లో నవగ్రహ విగ్రహాలు ధ్వంసమైన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
ఆకట్టుకున్న కన్యా వందనం
హిందు ఆధ్యాత్మిక మేళాలో శుక్రవారం ఉదయం నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులతో కన్యా వందనం నిర్వహించారు. బాలికలకు పిల్లలు పాదపూజ నిర్వహించి, ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే పలువురు విద్యార్థులు నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. చెన్నై , బెంగళూరు, తిరువనంతపురం, జైపూర్, ఇండోర్, ముంబై , రాయపూర్, భువనేశ్వర్, రాంచీ తదితర నగరాల్లోని ధార్మిక సంస్థలు తాము అందిస్తున్న సేవలను మేళాలో ప్రదర్శించారు.