కరీంనగర్, వెలుగు: ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో డ్రామాలు ఆడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. గత కొన్ని రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే దానిపై నమ్మకం పోతోందన్నారు. సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం క్లాక్‌టవర్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తాను కూడా మొదట హైడ్రాకు సపోర్ట్ చేశానని, కొందరు పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలు, విల్లాలు, ఫాంహౌస్‌లు కూలుస్తుంటే సమర్థించానని గుర్తు చేశారు. కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూల్చడం సరికాదన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కట్టిన ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు..? ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ అని అని, ప్రజలు ఆ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పెట్టారన్నారు.
కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదని, చేతనైతే వరదల వల్ల నష్టపోయిన వారి కోసం యాగాలు చేయాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు ఆంటోనీరెడ్డి పాల్గొన్నారు.