ఉద్యమకారులను కేసీఆర్ ముంచిండు: కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ 

ఉద్యమకారులను కేసీఆర్ ముంచిండు: కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ 
  • తెలంగాణ వచ్చాక ఆయన కుటుంబమే బాగుపడ్డది.. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిండు 
  • కేంద్ర పథకాలను అడ్డుకుంటున్నడని ఫైర్.. నర్సాపూర్​లో బీజేపీ బహిరంగ సభ 

మెదక్/నర్సాపూర్/పరకాల, వెలుగు: తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ నిండా ముంచారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మండిపడ్డారు. ‘‘తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కొట్లాడలేదు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ఉద్యమించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడతాయని కలలు కన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడి టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక అందరి కలలు కల్లలయ్యాయి. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది” అని ఆయన అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్​లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ రాజమణి, పరకాల మున్సిపల్​మాజీ చైర్మన్​మార్త రాజభద్రయ్యతో పాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. భూపేంద్ర యాదవ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీకి ఆదరణ పెరుగుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పని ఖతం అవుతుందన్నారు. ‘‘మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.4.50 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసమని కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు పంపిస్తే వాటిని రాష్ట్ర సర్కార్ హైదరాబాద్ లోనే ఆపేస్తోంది. దీంతో ఆయా పథకాల ఫలాలు లబ్ధిదారులకు అందడం లేదు” అని మండిపడ్డారు. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దేశం ఎంతో వెనుకబడిందని, ప్రధాని మోడీ వచ్చాక అన్ని రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. రాజస్తాన్ లో తమ పార్టీ నేతలనే ఏకం చేయలేని రాహుల్.. దేశాన్ని ఎలా ఏకం చేస్తారని విమర్శించారు. 

కేసీఆర్ అడ్రస్ గల్లంతు చేస్త: ఈటల 
అసెంబ్లీలో తనను ఎదుర్కొనే దమ్ము లేకనే రెండుసార్లు సస్పెండ్ చేశారని సీఎం కేసీఆర్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ అడ్రస్ గల్లంతు చేసేదాకా విశ్రమించబోనని చెప్పారు. ‘‘ఆదాయం కోసం ఊరూరా బెల్ట్ షాప్ లు తెరిపించి తాగుబోతుల తెలంగాణగా మార్చారు. మద్యం కారణంగా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కేసీఆర్.. మహిళల పుస్తెలు తెంపుతున్నడు’’ అని ఈటల మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులు, అవినీతి, మద్యం అమ్మకాలు, భూములు కొల్లగొట్టడంలో నెంబర్ వన్ గా మార్చారని ఆయన విమర్శించారు. నర్సాపూర్ ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్ నేతలకు డబ్బులిచ్చి మరీ యాత్రలకు పంపించారని చెప్పారు. సభలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ కె. లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి బాబు మోహన్, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్.. ఓ అమ్రిష్ పురి: బండి సంజయ్   
సీఎం కేసీఆర్ సినిమాల్లోని అమ్రిష్ పురిలా మంత్రగాడు అయ్యారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ విమర్శించారు. ‘‘కేసీఆర్ మంత్రగాళ్లు చెప్పినట్టు చేస్తున్నారు. వాళ్లు చెప్పారనే సచివాలయం కూలగొట్టారు. టీఆర్ఎస్ పేరు ఉంటే దుకాణం బంద్ అవుతుందని చెప్పడంతో బీఆర్ఎస్ అని మార్చారు” అని అన్నారు. కేసీఆర్ బీటీ బ్యాచ్ ను సంకలేసుకొని తిరుగుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘బ్యాంకు లోన్లు ఎగ్గొట్టిన కేసీఆర్.. దుబాయ్, మస్కట్, లండన్ లో పెట్టుబడులు పెట్టారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వని మూర్ఖుడు కేసీఆర్’’ అని ఫైర్ అయ్యారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్ పతనం మొదలైంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. మాది పిరికిపందల పార్టీ కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తం. కల్వకుంట్ల కుటుంబం కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కల్పిస్తం” అని చెప్పారు.