పిల్లలకు మాతృభాష నేర్పించండి: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

పిల్లలకు మాతృభాష నేర్పించండి: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  • సృజనాత్మక ఆలోచనలకు మాతృభాషే కీలకం
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: చిన్నారుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో మాతృభాష కీలకమని, పిల్లలకు మాతృభాష  నేర్పించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తల్లిదండ్రులకు సూచించారు. "మాతృభాష లోతైన అభ్యాసానికి ప్రధానమైనది. ఎందుకంటే మన భాషలు కేవలం కమ్యూనికేషన్ సాధనాలు మాత్రమే కాదు. అవి చరిత్ర, సంప్రదాయం, జానపద కథల రిపోజిటరీలు. తరతరాల సామూహిక జ్ఞానాన్ని సంరక్షిస్తాయి.

ప్రత్యేకమైన ప్రపంచ దృష్టికోణాన్ని అందిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. బుధవారం భారతీయ భాషా ఉత్సవ్ వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  అలాగే, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 మన భాషాభిమానాన్ని తిరిగి పొందేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని తెలిపారు. దేశ భాషా వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రధాని మోదీ నిబద్ధతతో పనిచేస్తున్నారని చెప్పారు.  “భారత నాగరికతలో భాషాపరమైన గౌరవం ఉంది.

భారతీయ భాషలన్నీ జాతీయ భాషలు, భారతీయత ఆత్మను ఏర్పరుస్తాయి. భాషా వైవిధ్యం జాతీయ ఐక్యతను బలపరుస్తుంది. “ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్” లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. కాబట్టి మన ప్రజలలో ప్రతి ఒక్కరూ భాషాభిమానాన్ని గౌరవ బ్యాడ్జ్‌‌‌‌‌‌‌‌గా ధరించాలి” అని ప్రధాన్ సూచించారు. పిల్లలు సృజనాత్మకత, భావోద్వేగ మేధస్సుతో నిండి, వారి మాతృభాషలో విద్యాభ్యాసం ప్రారంభించినప్పుడే అభివృద్ధి చెందుతారని తెలిపారు.