- మొదటి వరల్డ్ స్కై డైవింగ్ డే నాడు సాహసం
చండీగఢ్: మొట్ట మొదటి వరల్డ్ స్కై డైవింగ్ డే రోజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అరుదైన సాహసం చేశారు. 53 ఏండ్ల వయసులో శనివారం ఆయన హర్యానాలో స్కై డైవ్ చేశారు. హర్యానాలోని నార్నాల్ ఎయిర్‌స్ట్రిప్‌లో దేశంలోని ఏకైక పౌర స్కైడైవింగ్ డ్రాప్ జోన్ అయిన స్కైహై వద్ద ఈ డైవ్ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత షెకావత్ మీడియాతో మాట్లాడారు. "ఈ రోజు నాకు చాలా థ్రిల్లింగ్ రోజు. ముఖ్యంగా, ప్రపంచానికి, ఏరోస్పోర్ట్స్ ప్రపంచానికి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ప్రపంచ స్కైడైవింగ్ దినోత్సవాన్ని మొదటిసారి జరుపుకుంటున్నాం. ఈరోజు నుంచి ఏరోస్పోర్ట్స్, టూరిజం కొత్త శిఖరాలను తాకుతాయి" అని పేర్కొన్నారు.
ఈ క్రీడలను ఆస్వాదించేందుకు వేలాది భారతీయులు దుబాయ్, సింగపూర్, థాయ్‌లాండ్, న్యూజిలాండ్ లాంటి దేశాలకు వెళ్లేవారని, ఇకపై వారంతా ఇక్కడే స్కైడైవింగ్ చేయొచ్చని ఆయన తెలిపారు. ఇది పర్యాటకాన్ని కూడా పెంచుతుందని చెప్పారు. టూరిజం మంత్రిగా.. మధ్యప్రదేశ్, గోవాతో సహా మరిన్ని ప్రదేశాలలో కొత్త పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రపంచ స్కైడైవింగ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జులైలో రెండో శనివారం జరుపుకోనున్నారు.