
ఫిబ్రవరి 27న జరగనున్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీచేస్తుందని.. బీఆర్ఎస్ పోటీచేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్ కు దిశా నిర్దేశం చేసేది ఎమ్మెల్సీ ఎన్నికలేనని.. మేధావి వర్గం తీర్పు తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని.. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కిషన్ రెడ్డి. తెలంగాణను కేసీఆర్ కుటుంబమంతా దోచుకుందని అన్నారు.
మార్పుకోసం కాంగ్రెస్ ను గెలిపించాలని రాహుల్, రేవంత్ లు ప్రచారం చేశారని.. ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని విస్మరించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని..ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు కిషన్ రెడ్డి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. మిగిలిన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చేతులెత్తేశారని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ 12లక్షలు ఇస్తామని హామీనిచ్చారని.. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు.
కాంగ్రెస్ మాట నమ్మి ఓటేస్తే ప్రజల ఆశలను అడియాశలు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పట్టించుకోవడంలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డిఏలపై ప్రభుత్వం నోరుమెదపడం లేదని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని అన్నారు.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రానుందని.. రానున్న రోజుల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట అభివృద్ధి వేగంగా జరుగుతోందని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతికి పెద్దపిట వేశారని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో మంచి పాలన జరుగుతుందని.. తెలంగాణ లో మంచి పాలన రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అన్ని వర్గాల సమస్యలపై ఉద్యమిస్తామని అన్నారు.