ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇస్తే.. మేమే తేలుస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇస్తే.. మేమే తేలుస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులను బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కేసును సీబీఐకి అప్పగిస్తే.. తామే తేలుస్తామని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద మార్కులు వేయించుకోవడానికి కేంద్ర మంత్రులను, మోడీని తిడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ ప్రభుత్వం మెట్రో నిర్మాణం చేస్తే తామెందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లేనిపోని ఆరోపణలు చేసి స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జలాల తరలింపును అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కేసు సీబీఐకి ఇవ్వండి.. నిగ్గు తేలుస్తాం

అధికారంలోకి రాకముందు పలు అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అన్నారు. సినిమా నటులు, జడ్జీలు, మీడియా ప్రముఖుల ఫోన్లు కూడా వదిలి పెట్టలేదని అన్నారు. కేసును సీబీఐకి అప్పగిస్తే.. నిజాలు నిగ్గు తేలుస్తామని మాట్లాడారు.