లాక్‌డౌన్ పై ప్రధాని చెప్పినట్టు చేద్దాం
మర్కజ్ కేసులు లేకుంటే ఈ పాటికి పరిస్థితి చాలా మెరుగుపడేది
ఏడాదికి సరిపడా ఆహారధాన్యాలు ఉన్నయ్..మందుల కొరతలేదు
‘వీ6–వెలుగు’ ఇంటర్వ్యూలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మర్కజ్ రిలేటడ్ కరోనా కేసులు లేకుంటే దేశంలో లాక్‌డౌన్ పొడిగింపు అంశమే తలెత్తేది కాదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో పీపీఈ కిట్లు, మందులు, వెంటిలేటర్లకు కొరత లేదని, ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని చెప్పారు. లాక్‌డౌన్ విషయంలో ప్రధాని ఏ పిలుపునిచ్చినా పాటిద్దామన్నారు. విదేశాల్లో చిక్కుకున్న స్టూడెంట్లకు అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నామని ఆయన చెప్పారు. వలస కూలీలను ఉంచిన షెల్టర్స్ కంటిన్యూ అవుతాయనన్నారు. ఢిల్లీ నుంచి ‘వీ6 –వెలుగు’కు కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు అంశాలను వెల్లడించారు.
వీ6 -వెలుగు: ఈ నెల 14 తర్వాత లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుందా..?
కిషన్‌రెడ్డి: ప్రపంచంలోని మిగతా దేశాలకు, మనకు చాలా తేడాలున్నాయి. అమెరికాలో ఒక ఇల్లు ఎకరం, రెండెకరాల్లో ఉంటుంది. మన దగ్గర జనసాంద్రత ఎక్కువ. అమెరికా, ఇటలీలాగా ఇక్కడ కరోనా తీవ్రత పెరిగితే చాలా పెద్దప్రమాదం జరిగే అవకాశముంది. అందుకే హోలీ ఆడొద్దని అప్పట్లో ప్రధాని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలను చైతన్యం చేస్తూ, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. అందుకే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత అందరి అభిప్రాయం మేరకు కరోనా నుంచి దేశ ప్రజల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నాం. ప్రధాని దేశానికి చౌకీదార్. లాక్‌డౌన్ ఏ రకంగా ఉంటుంది అనేది ఆయన నేరుగా ప్రకటిస్తారు. ప్రధాని ఏ పిలుపు ఇచ్చినా పాటిద్దాం. దాన్ని పాటిస్తేనే కరోనాను మనం ఓడిస్తాం. ఊహాగానాలు మంచిది కాదు.
ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ఏం చేస్తున్నరు?
లాక్‌డౌన్‌తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు రూ. 1.70 లక్షల కోట్లప్యాకేజీని ప్రధాని ప్రకటించారు. ఇంకో లక్ష కోట్లు ప్రజలకు మేలు జరిగే చర్యలు చేపట్టబోతున్నారు. లాక్‌డౌన్ ఎన్ని రోజులు ఉన్నా ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బియ్యాన్ని కేజీ రూ. 3కే పంపిణీ చేస్తున్నాం. పప్పులు, ఇతర వస్తువులు అందజేస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు సాయం అందిస్తున్నాం. ఎవరూ ఉపాసం ఉండకూడదు అనేది కేంద్రం భావన. సంవత్సరానికి కావాల్సిన ఆహార ధాన్యాలు దేశంలో సిద్ధంగా ఉన్నాయి. వలస కూలీలకు షెల్టర్స్ కొనసాగుతాయి. మెడిసిన్, ఆహారం, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం. వాళ్లను ఆదుకోవాలని అన్నిరాష్ట్రాలకు సూచించాం. అందుకు సంబంధించిన డబ్బులు ఇచ్చాం.
మర్కజ్‌కు వెళ్లొచ్చిన వాళ్లు చాలా మంది సమాచారం ఇవ్వడం లేదు.. వాళ్ల పరిస్థితేంటి?
వాళ్లంతా సమాచారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల ద్వారా అలాంటి వారిని పట్టుకుంటున్నారు. కొన్ని రోజుల్లోనే దీని తీవ్రత తగ్గుతుంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు, వారి బంధువులకు మాత్రమే కరోనా వచ్చింది తప్ప.. కరోనా థర్డ్‌స్టేజీలోకి దేశం ఎంటర్‌కాలేదు. ఇంకా ఎవరైనా మర్కజ్‌కు వెళ్లిన వాళ్లు ఉంటే సమాచారం ఇవ్వాలి. ఇది ఏ ఒక్కరికో వ్యతిరేకం కాదు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన మన దేశం వారిపై ఏ రకమైన కేసులు పెట్టడం లేదు. టూరిస్ట్ వీసా మీద వచ్చి మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం నేరం. అలాంటి వాళ్లపైనే కేసులు పెడుతున్నాం. మీ ఆరోగ్యం కోసమే సమాచారం ఇవ్వాలని మర్కజ్ వెళ్లి వచ్చిన వాళ్లను కోరుతున్నాం.
మర్కజ్ కు వెళ్లిన వాళ్లు ఎంతమంది ఉన్నారు?
మర్కజ్ మీటింగ్ టైంలో 13 వేల సెల్‌ఫోన్లు అక్కడున్నట్టు టవర్ లోకేషన్ చూపించింది. అక్కడి వీడియోలు, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లను బట్టే లెక్కించాం. మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్ల వివరాలు చెప్తే క్యాష్ బహుమతులు ఇస్తామని ప్రకటించాం. మర్కజ్‌కు సంబంధించిన వాళ్లు 50 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ‘‘కరోనా మనల్ని ఏం చేయదు. దేవుడే మనల్ని రక్షిస్తాడు.. సామూహికంగా రండి” అని నిర్వాహకులు సూచించారు. మర్కజ్ సంస్థ నిర్లక్ష్యంతో, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. మర్కజ్ కేసులు లేకపోతే కరోనా కట్టడిలో ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. మర్కజ్‌తోనే దేశంలో పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగాయి.
లాక్‌డౌన్‌తో ప్రైవేటు కంపెనీలు జీతాల్లో కోత పెట్టే పరిస్థితి ఉంది? చాలా మంది ఆందోళనలో ఉన్నారు కదా?
ఈ సమస్య ప్రపంచం మొత్తం ఉంది. 220 దేశాలను కరోనా పట్టి పీడిస్తోంది. 60 శాతానికి పైగా జనాభా గ్రామాల్లో ఉంది. ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కార్మికులు, ఉద్యోగులకు నష్టం వాటిల్లకుండా చూస్తాం. ఇలాంటి ఇబ్బందులను రానున్న రోజుల్లో అధిగమిస్తాం.
స్టూడెంట్స్, ఉద్యోగులు వేర్వేరు దేశాల్లో ఇరుక్కుపోయారు. వారిని ఎప్పుడు రప్పిస్తారు?
ఎయిర్‌పోర్టులు ఓపెన్ చేసేంతవరకూ ఈ ఇబ్బందులు తప్పవు. అలా చిక్కుకుపోయిన వారి బాగోగులను చూస్తున్నాం. ఎక్కడ ఉన్న వాళ్లను అక్కడే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఎమర్జెన్సీ కోసమే విమానాలను ఉపయోగిస్తున్నాం. కొన్ని వేల మంది మన దేశానికి తిరిగి రావడానికి చాలా దేశాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్లకు ధైర్యం కల్పిస్తున్నాం. ఎయిర్‌పోర్టులు ఓపెన్ చేస్తే ఏమవుతుందో తెలియదు. మర్కజ్ కారణంగా ఇప్పటికే మనం నష్టపోయాం. ఎవరూ టెన్షన్ పడొద్దు.
సోషల్ మీడియాలో రూమర్స్‌ను ఎలా అరికడతారు?
ఇప్పటికే వందలాది కేసులు పెట్టాం. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేసినా, ఏదైనా ఒక మతాన్ని కులాన్ని వ్యక్తిని అవమానించేలా మెసేజ్‌లు పెట్టినా వారిపై క్రిమినల్ కేసులు పెడుతాం. వారం రోజులుగా అనేక కంపెనీలతో హోంశాఖ చర్చించి వారికి అనేక ఆదేశాలు ఇచ్చింది. సామూహిక పోస్టింగ్‌లు చేయకుండా వాట్సప్‌ను కట్టడి చేస్తున్నాం. సోషల్ మీడియాను సానుకూలంగా వాడుకోవాలి తప్ప తప్పుడు పోస్టింగ్‌లతో జైలుకు వెళక్ల తప్పదు.
కమ్యూనిటీ స్ప్రెడ్ మొదలవలేదా?
కరోనా ఎవరో ఒక వ్యక్తికి సంబంధం లేకుండా వచ్చేది కాదు. కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా ఎవరో ఒకరి ద్వారానే వస్తుంది. గాలితో ఈ వ్యాధి రాదు. దేశంలో ఎక్కడా కమ్యూనిటీ స్ప్రెడ్ లేదు. లాక్‌డౌన్ నియమాలను అందరూ తప్పనిసరిగా పాటించాలి. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా కట్టడి చేయగలిగాం. మన జీన్స్‌కూడా వ్యాధి వ్యాప్తిని అరికడుతున్నాయి. దేశంలో పీపీఈ కిట్లు, హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మందుల కొరత లేదు. గత మూడు రోజుల్లో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గుతోంది. వచ్చే పది రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ప్రజలంతా ఇండ్లల్లోనే ఉండాలి. సెల్ఫ్ డిస్టెన్స్ పాటించాలి.
For More News..