మార్చి 22న ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి
ఉద్యోగుల బయోమెట్రిక్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం
దేశ సరిహద్దు జిల్లాల్లో గ్రామసభలు ఏర్పాటు
కేసీఆర్ ముందు కరోనా అరికట్టు.. ఆ తర్వాత CAA గురించి ఆలోచించు
దేశంలో కరోనా వ్యాప్తి అధికమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా భాదితుల సంఖ్య రెండు లక్షలు దాటింది. దాదాపు పది వేల మందికి పైగా మరణించారు. ఇక భారత్ విషయానికొస్తే.. దేశంలో 195 కేసులు నమోదు కాగా.. అయిదుగురు చనిపోయారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం దేశ ప్రభుత్వం, రాష్ఠ్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆయన ఇంట్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనాపై అన్ని చర్యలు తీసుకుంటుందని.. కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా 195 కేసులు నమోదయ్యాయి. అందులో ఇండియాకు చెందిన వారు 163, విదేశాలకు చెందిన వారు 32 మంది ఉన్నారు. కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా 69 వేల మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా పరిస్థితులపై పార్లమెంట్‌లో ఆరోగ్యమంత్రి ప్రకటన కూడా చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు కేబినెట్ సెక్రటరీ 22 సమావేశాలు నిర్వహించారు. ఇతర దేశాలలో జరిగిన తప్పులు మన దగ్గర జరగకూడదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 16 రివ్యూ మీటింగ్‌లు నిర్వహించింది. ఓడల ద్వారా వచ్చే సరుకు రవాణాను నిషేధించాం. దేశ సరిహద్దులో కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం. సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. కేవలం 20 రోడ్లను మాత్రం తెరచి ఉంచాం. ఆ రోడ్ల ద్వారానే రవాణా సాగాలి. మంత్రులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం. విదేశాల్లో ఉన్న భారత రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నాం.
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి కూడా వైద్య సేవలు అందిస్తున్నం. కరోనా బాదితుల గుర్తింపు కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేశాం. వివిధ దేశాల సరిహద్దులో ఉన్న జిల్లాల్లోని 4, 645 గ్రామాలలో గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ఈ గ్రామసభల నిర్వహణకోసం కేంద్ర ప్రభుత్వం 8 టీంలను ఏర్పాటు చేసింది. విదేశాలలో ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకొని మన దగ్గర కూడా అమలు చేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చే వారిని పరీక్షించిన తర్వాతే పంపిస్తున్నాం. కరోనా టెస్టుల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఉపయోగిస్తున్నాం. పాజిటివ్ వచ్చిన పేషంట్లకు నెగిటివ్ వచ్చిన తర్వాతే ఇంటికి పంపించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రభుత్వ ఆఫీసులకు సందర్శకులు రావద్దని సూచించాం. ఇప్పటివరకు ఎయిర్ పోర్టులలో 14 లక్షల 30,000 మందికి స్ర్కీనింగ్ చేశాం. దేశంలో హాస్పిటల్స్ సరిపోకపోతే ఆయా ప్రాంతాలలో ఉన్న స్కూళ్లను, కాలేజీలను కూడా వాడుకుంటాం. WHO సహకారాన్ని కూడా కోరాము. 260 మందికి కరోనా గురించి శిక్షణ ఇచ్చి ఆయా రాష్ట్రాలకు పంపించాము. ప్రతి రాష్ట్రంలోనూ టోల్ ఫ్రీ నెంబర్స్ అందుబాటులో ఉంచాం. మార్చి 18 నుంచి ఇతర దేశాలనుంచి వచ్చేవారిని నిషేధించాం. కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారిని మాత్రమే దేశంలోకి రానిస్తాం.
ప్రభుత్వ ఉద్యోగులకు వీక్లీ రోస్టర్ అమలు చేయాలని నిర్ణయించాం. 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని నిర్ణయించాం. సాధ్యమైనంత వరకు ప్రైవేట్ కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ ఆఫీసులలో బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బయోమెట్రిక్ వాడొద్దని సూచించాం. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా.. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా శాలరీ కటింగ్ లేకుండా ఇవ్వాలని కార్మికశాఖ ద్వారా ఉత్తర్వులు ఇచ్చాం. ప్రైవేట్ ఉద్యోగులను ఆఫీసుకు రాకపోతే జీతాలు కట్ చేస్తామని వేధించొద్దు. అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్ర భాషలలో కరపత్రాలు పంపి ప్రజలలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. ఆరోగ్య శాఖకు సంబంధించిన ఏ డబ్బులైనా సరే.. కరోనా కోసం వాడుకోవచ్చు. నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, మాస్కులు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా నివారణకు ప్రజలందరూ సహకరించాలి. కరోనాకు మందు లేదు కాబట్టి దాన్ని రాకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. ఇతర దేశాల నంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తీసుకువెళ్తామంటే.. వారంతా ధర్నాలు చేస్తున్నారు. అలా కాకుండా అందరూ అధికారులకు సహకరించాలి. కరోనాపై అంతిమ విజయం మనదే కావాలి. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు జనతా కర్ఫ్యూ విధించుకొని ఇంట్లోనే ఉండాలి. ఆరోజు రోడ్డు మీదకు ఎటువంటి వాహానాలు రాకూడదు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కరోనా నివారణకు కలిసి పనిచేయాలని కోరుతున్నాం అని ఆయన అన్నారు.
కాగా.. CAAకు వ్యతిరేకంగా దేశంలోని పార్టీలన్నింటిని ఒకే తాటిపైకి తెస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారని.. దానిపై మీ అభిప్రాయం ఏంటని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ముందు కరోనాని అరికట్టాలని ఆయన కోరారు. కేసీఆర్ కరోనా కట్టడి కాకముందే అందరిని ఆ వైపుకు మళ్లిస్తే కరోనా వ్యాప్తి అధికమవుతుందని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు.
For More News..