
హైదరాబాద్: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని.. కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ అపోహలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా అని దుయ్యబట్టారు.
కాంగ్రెస్, డీఎంకేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని.. అందుకే భయంతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని అన్నారు. ప్రతిపక్షాలు రిజర్వేషన్లు, డీలిమిటేషన్ పేరిట కుట్ర చేస్తున్నాయని.. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాయని నిప్పులు చెరిగారు. సౌత్ ఇండియాపై ప్రధాని మోడీకి ప్రత్యేక ప్రేమ ఉందని.. డీలిమిటేషన్ ద్వారా ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రానికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
ALSO READ | డీలిమిటేషన్ 25 ఏండ్లు వాయిదా వేయాలె: సీఎం రేవంత్ రెడ్డి
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన శనివారం (మార్చి 22) చెన్నైలో దక్షిణ రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగంత్ సింగ్ మాన్, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు హజరయ్యారు.
మరో 25 ఏళ్ల వరకు డీలిమిటేషన్ చేయవద్దని ఈ సమావేశంలో తీర్మానించారు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే.. కుటుంబ నియంత్రణను స్ట్రిక్ట్‌గా అమలు చేసిన సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతోందని అన్ని పార్టీలు ముక్తకంఠంతో చెప్పాయి. అలాగే.. నెక్ట్స్ జేఏసీ మీటింగ్‌ను తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రతిపాదించారు.