వేరే దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో ప్రస్తుతానికి లాక్ డౌన్ పెంచే ఉద్దేశం లేదని ఆయన తేల్చి చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడూ ఒక సైనికుడిలాగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ వైరస్ ని కట్టడి చేయాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకూడదని ఆయన అన్నారు. అయితే చాలా మంది పిల్లలతో కలిసి బయటకి వస్తున్నారని.. అవసరం ఉంటే మాత్రమే బయటకు రావాలని ఆయన అన్నారు.
కాగా..ఢిల్లీ నిజాముద్దీన్ కేసుల గురించి ఆయన స్పందించారు. నిజాముద్దీన్ లో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. నిజాముద్దీన్ ప్రార్థనలకు హాజరైన వారందరిని బస్సుల్లో హాస్పిటల్ కి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 10న జరిగిన తబ్లీఘీ-జమాత్ కారణంగా వైరస్ వ్యాప్తి పెరిగిందని ఆయన అన్నారు. ‘తబ్లీఘీ-జమాత్‌కు పలు దేశాల మత ప్రచారకులు హాజరయ్యారు. మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు తబ్లీఘ్-ఈ-జమాత్ హజరయ్యారు. వారందరి లిస్టు రెడీ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా చాలా మంది ఈ ప్రార్థనలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది హాజరయ్యారు. వారిని కూడా గుర్తించి క్వారంటైన్ కు తరలిస్తాం’ అని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కూలీలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఒక్కరు కూడా తిండి లేకుండా ఉండకూడదని ఆయన అన్నారు. కరోనా వైరస్ కు మందులేదని… సామాజిక దూరమే మందని ఆయన పిలుపునిచ్చారు. చిన్నపిల్లలు, ముసలి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రహోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కోరారు.
For More News..