ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీల మధ్య పోలవరం విషయంలో మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఇప్పటికే పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ విధ్వంసమే పోలవరానికి శాపం అయ్యిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పోలవరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని, కాఫర్ డ్యామ్ విషయంలో కానీ, డయాఫ్రామ్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరానికి ఈ దుస్థితి పట్టిందని అన్నారు.
2014 నుండి 19 మధ్య రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పిందని అన్నారు.ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎవరు చేపట్టాలనేది కేంద్రం, జలశక్తి శాఖ మంత్రి నిర్ణయిస్తారని అన్నారు. పోలవరంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ నెలకొన్న నేపథ్యంలో కూటమిలో ఉన్న బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.