బెల్లంపల్లి/నస్పూర్, వెలుగు: ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిర్భయంగా ఓటేయాలని పేర్కొంటూ బెల్లంపల్లి పట్టణంలో గురువారం సాయంత్రం కేంద్ర పారామిలటరీ సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని తిలక్ క్రీడా మైదానం నుంచి ప్రారంభమైన కవాతు ఏఎంసీ మైదానం వరకు కొనసాగింది. సెంట్రల్ రిజర్వ్ డ్ పోలీస్ మహిళా కమాండోల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ మాట్లాడుతూ.. ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ తరహా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. బెల్లంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.రాహుల్, ఏసీపీ సదయ్య, మహిళా కమాండెంట్ సంఘ మిత్రాయి, మున్సిపల్ కమిషనర్ కె.సమ్మయ్య పాల్గొన్నారు. నస్పూర్ లోని జీటీ హాస్టల్ నుంచి పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మంచిర్యాల రూరల్ సీఐ టి.సంజీవ్ మాట్లాడుతూ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలు ముగిసే వరకు కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం.రవికుమార్, అదనపు ఎస్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.