ముంబై: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ట్రైన్ యాక్సిడెంట్‌పై సెంట్రల్ రైల్వే స్పందించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడించింది. మంటలు వ్యాపించినట్లు వదంతులు రావడంతో ప్రయాణికులు చైన్ లాగడంతో లఖ్‌నవూ-ముంబాయి ఎక్స్ ప్రెస్ పట్టాలపై ఆగింది. రైలు ఆగిన తర్వాత ఒక బోగీ నుండి ప్రయాణికులు కిందకు దిగి ట్రాక్ దాటుతుండగా.. అదే సమయంలో దూసుకువచ్చిన బెంగుళూరు- ఢిల్లీ కర్నాటక ఎక్స్ ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఘటన స్థలానికి అంబులెన్స్‌లను పంపి సహయక చర్యలు కొనసాగిస్తున్నామని సెంట్రల్ రైల్వే తెలిపింది. ఘటన స్థలానికి విపత్తు సహయ రైలు బయలుదేరినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ALSO READ | ప్రాణ భయంతో రైలు నుంచి దూకేస్తే.. మరో రైలు వచ్చి ఢీకొట్టింది : మహారాష్ట్రలో ఆరుగురి మృతి
ఘటన స్థలంలో సహయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. జలగావ్ జిల్లా రైల్ ప్రమాదంలో మృతి చెందిన వారంతా యూపీ వాసులే కావడంతో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహయం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.