సీతారామకు మేడిగడ్డతో మెలిక: అనుమతులు ఇప్పుడే ఇవ్వలేమన్న కేంద్రం

సీతారామకు మేడిగడ్డతో మెలిక: అనుమతులు ఇప్పుడే ఇవ్వలేమన్న కేంద్రం
  • డిజైన్ల లోపంతో మేడిగడ్డ కుంగిందంటూ పేచీ 
  • సీతారామ డిజైన్లను మరోసారి రివ్యూ చేస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: సీతారామ ప్రాజెక్టుకు​అనుమతులపై కేంద్రం మెలిక పెట్టింది. ఆ ప్రాజెక్టుకు ఇప్పుడప్పుడే అనుమతులు మంజూరు చేయలేమని చెప్పింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులపై అధికారులు చర్చించారు. అయితే సీతారామ ప్రాజెక్టును మేడిగడ్డకు లింకు పెడుతూ అనుమతులను కేంద్రం పెండింగ్​లో పెట్టింది. 

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని టెక్నికల్​అంశాలపై మరోసారి రివ్యూ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర అధికారులకు స్పష్టం చేసింది. నెల రోజుల తర్వాత దీనిపై మరోసారి సమావేశం నిర్వహిద్దామని కేంద్రం చెప్పినట్టు తెలిసింది.  

మరోసారి డిజైన్లను చూడాల్సిందే.. 

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్​2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. ఇందుకు ప్రధాన కారణం డిజైన్లలో లోపమేనని, సరిగ్గా ఇన్వెస్టిగేషన్స్​ చేయకుండానే బ్యారేజీ కట్టడం వల్లే కుంగిపోయిందని నిపుణులతో పాటు ఐఐటీ రూర్కీ నివేదిక కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ లాంటి ఘటన మరోసారి జరగకుండా ఉండేందుకు సీతారామ ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తగా ఉండాలని టీఏసీ సూచించినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను మరోసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని.. వాటిని సీడబ్ల్యూసీ, టీఏసీ రివ్యూ చేశాక ప్రాజెక్టు టెక్నికల్​అనుమతులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. 

అయితే, ఇప్పటికే ఈ ప్రాజెక్టులోని మూడు పంప్​హౌస్​లను ప్రారంభించామని, టెక్నికల్​ అనుమతులు మంజూరు చేయాలని అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టును నిరుడు ఆగస్టు 15న సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టులో భాగమైన పూసుగూడెం పంప్​హౌస్​ను రేవంత్​ ప్రారంభించగా.. మొదటి పంప్​హౌస్​ను కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మూడో పంప్​హౌస్​ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్​జిల్లాల్లోని 1.20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు.