తెలుగు రచయితలకు కేంద్ర సాహిత్య పురస్కారాలు

న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడ‌మీ 2022 సంవత్సరానికి గాను యువ‌, బాల పుర‌స్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలను బాలసాహిత్య పురస్కారాలకు  ప్రకటించింది.  తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన ప‌త్తిపాక మోహ‌న్ కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ బాల పుర‌స్కారానికి ఎంపిక చేశారు. అలాగే ఏపీలోని చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజుకు కేంద్ర సాహిత్య అకాడ‌మీ యువ‌ పుర‌స్కారం వరించింది. 

పత్తిపాక.. బాలల తాత బాపూజీ..

కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోషహన్  నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ కవి, గేయ రచయిత సి.నారాయణరెడ్డి శిష్యుడైన పత్తిపాక మోహన్ రాసిన బాల‌ల తాత  బాపూజీ (క‌విత్వం) కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికైంది. 
సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించిన పత్తిపాక మోహన్ పిల్లల కోసం అనేక రచనలు చేశారు. పురస్కారానికి ఎంపికైన బాలల తాత బాపూజీతోపాటు.. పిలల కోసం మన కవులు, జో.. అచ్యుతానంద జోజో ముకుంద.. ఒక్కేసి.. పువ్వేసి. చందమామ.. చందమామ రావే వంటి అనేక రచనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు. 

పల్లిపట్టు నాగరాజు.. యాలై పూడ్సింది

చిత్తూరు జిల్లా యాసలో కష్ట జీవులు, బడుగుల బతుకులపై ‘యాలై పూడ్సింది’ శీర్షికతో రచించిన కవితా సంపుటిని కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపిక చేసింది. 35 ఏళ్ల లోపు సాహిత్య వేత్తలకు కేంద్ర సాహిత్య యువ పురస్కారాలు ప్రకటిస్తారు. 2011లో ప్రారంభించిన ఈ పురస్కారం కింద 50వేల రూపాయల నగదుతోపాటు జ్ఞాపికలను బహూకరిస్తారు. పల్లిపట్టు నాగరాజు తెలుగు భాష ఉపాధ్యాయుడు. శాంతిపురం మండలం పెద్దూరు హైస్కూలులో పనిచేస్తున్న సమయంలో ఆయన ‘యాలై పూడ్సింది’ కవితా సంపుటిని రాసి ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు’ను కూడా అందుకున్నారు.  

తెలుగు భాషతో పాటు అస్సామీ, బెంగాలీ, బోడో, దోగ్రి, ఆంగ్లము (ఇంగ్లిష్), గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలీ, మళయాళం, మణిపురి, మరాఠీ, నేపాలి, ఒడియా, రాజస్థానీ, సంస్కృతం, సింధి, తమిళం, ఉర్దూ భాషల్లో ఉత్తమ రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా పురస్కారాలు అందిస్తోంది.