జోగిని జీవితాన్ని ప్రతిబింబించిన త్రికాల

జోగిని జీవితాన్ని ప్రతిబింబించిన త్రికాల
  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ 

కాజిపేట,వెలుగు: తెలంగాణ పల్లెల్లో జోగిని జీవితాన్ని ‘త్రికాల’ ప్రతిబింబించిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. ఆదివారం కాజిపేట దర్గా రోడ్డులోని ఎస్ వీఎస్ఎల్ ఆర్కేడ్ లో నిట్ ప్రొఫెసర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంధ్యా విప్లవ్ రచించిన త్రికాల పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. త్రికాల..ఒక దళిత తెలంగాణ యువకుడి విజయగాథ అని పేర్కొన్నారు.   సామాజిక దురాచారానికి బలైన జోగిని కుటుంబం నుంచి వెల్లువిరిసిన విద్యాకుసుమం యధార్థ వ్యధ అని తెలిపారు.  తన జీవితంలో ఎన్నో అవమానాలు, ఆటు పోట్లను ఎదుర్కొని.. విదేశాల్లో స్థిరపడ్డ డాక్టర్ చిన్నయ్య జీవితాన్ని నవలలో అక్షరీకరించడం గొప్ప విషయమన్నారు.  

యధార్థ గాథలను కథలుగా కాకుండా నవల రూపంలో తీసుకొస్తే పాఠకులు హృదయాల్లో చొచ్చుకుపోతాయని కేయూ తెలుగు విభాగం మాజీ హెడ్  కాత్యాయని విద్మహే పేర్కొన్నారు.  కార్యక్రమంలో కేయూ మాజీ ప్రొఫెసర్ బన్నా అయిలయ్య, టీవీవీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కేబీ చంద్రభాను, రచయితలు చంద్, లోచన్, బాసిత్ కోడం కుమారస్వామి, పద్మావతి, ప్రభావతి, రాజేందర్,  సామాజిక ఉద్యమకారులు శంకర్ రావు, బండి దుర్గాప్రసాద్, సంజీవ్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.