న్యూఢిల్లీ, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం రిజిస్టర్డ్ కంపెనీల ర్యాంకింగ్ లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. కర్నాటక, తమిళనాడు తర్వాతి స్థానాల్లో తెలంగాణ నిలిచిందని కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖ (ఎంసీఏ) పేర్కొంది.
ఈ మేరకు మంగళవారం రాజ్య సభలో ఎంపీ వద్ది రాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కార్పొరేట్ అఫైర్స్ శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో వివిధ రంగాలకు సంబంధించి మొత్తం1,05,424 కంపెనీలు రిజిస్టర్ అయినట్టు తెలిపారు.
ఇందులో అత్యధికంగా 39,007 బిజినెస్ సర్వీస్ కంపెనీలు ఉన్నట్టు వెల్లడించారు. 2023–24 ఫైనాన్షియల్ ఈయర్ లో ఈ కంపెనీల టర్నోవర్ రూ.11 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. ఎంసీఏ లో గత నెల 30 వరకు జరిగిన ఫైలింగ్స్ ఆధారంగా ఈ టర్నోవర్ గుర్తించినట్టు చెప్పారు.