
కాగజ్ నగర్/మంచిర్యాల/కోల్‌బెల్ట్/ఆదిలాబాద్ఫొటోగ్రాఫర్, వెలుగు: తెలంగాణ–మహారాష్ట్ర మధ్య సరిహద్దు సిర్పూర్ టీ మండలం వద్ద వార్ధా నది ఉధృతితో ప్రవహిస్తోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం సెంట్రల్ వాటర్ కమిషన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్యాహ్నం వార్ధా నది సిర్పూర్ టీ మండలంలో రికార్డ్ స్థాయిలో 162.57 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాయంత్రానికి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాలు, నది సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నదీ తీరంలోని పంట చేనులు నీటితో మునిగిపోవడంతో రైతులు అల్లాడుతున్నారు.
మరోవైపు ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో గోదావరి నదికి సోమవారం వరద ఉధృతి తగ్గింది. 20.175 టీఎంసీల కెపాసిటీ గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో 16.088 టీఎంసీలు నిల్వ చేసి వరద నీటిని గోదావరిలోకి వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టు నుంచి 22 వేలు, క్యాచ్మెంట్ఏరియా నుంచి 67 వేలు, మొత్తం 89 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 12 గేట్లను ఓపెన్‌చేసి నీటిని రిలీజ్చేస్తున్నారు. వరదనీరు నిలిచిపోవడంతో మందమర్రి- రామకృష్ణాపూర్రహదారిలోని అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.