- వివరాలడిగి తెలుసుకున్న సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ నిపుణులు
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామంలోని పార్వతీ బ్యారేజ్ తో పాటు సరస్వతి పంప్ హౌస్ ను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ ఎక్స్పర్ట్స్ గురువారం పరిశీలించారు. స్థానిక ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సరస్వతీ పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి మోటార్లను పరిశీలించారు. తర్వాత పార్వతి బ్యారేజీ దగ్గరికి వెళ్లి 54 నుంచి 61 గేట్ల దగ్గర కుంగిపోయిన గార్డర్లను పరిశీలించారు.
బ్యారేజ్ కింది భాగంలో జరుగుతున్న మరమ్మతు పనులు పరిశీలించి వివరాలు సేకరించారు. 2021, జులైలో పడ్డ వానలకు సరస్వతి పంప్ హౌజ్ నుంచి పార్వతీ బ్యారేజీలో ఎత్తిపోసే 700 మీటర్ల మేర పొడవున్న పైపులైన్లో 200 మీటర్లు పైకి తేలింది. అప్పుడు నామమాత్రంగా మట్టి వేసి పైపును పూడ్చేశారు. 2022, ఆగస్టులో పడ్డ వానలకు సరస్వతి పంప్ హౌస్లోకి నీళ్లు చేరి పంపులు మునిగిపోయాయి. దాంతో అప్పటి నుంచి ఎత్తిపోతలు కూడా నిలిచిపోయాయి.