- నిందితులు ఇద్దరూ మైనర్లే.!
బషీర్‌బాగ్, వెలుగు: ఖైరతాబాద్ ఐమాక్స్ వద్ద అడ్వొకేట్ కల్యాణ్‌పై జరిగిన దాడి కేసును పోలీసులు చేధించారు. అతడి మొబైల్ ను రికవరీ చేసి, నిందితులను మైనర్లుగా గుర్తించారు. దాడి కంటే ముందు అబిడ్స్ పీఎస్ పరిధిలోనూ మరో మొబైల్ స్నాచింగ్ కు పాల్పడినట్లు ఏసీపీ చంద్రశేఖర్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున గన్ ఫౌండ్రీలోని ప్రసాద్ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్ ను ఇద్దరు మైనర్లు కత్తితో బెదిరించి, అతడి మొబైల్ ను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు.
అక్కడి నుంచి బైక్‌పై ఐమాక్స్ వద్దకు వెళ్లి, అక్కడ వాకింగ్ చేస్తున్న అడ్వొకేట్ కల్యాణ్ ఫోన్ చోరీకి యత్నించారన్నారు. అతను ప్రతిఘటించడంతో దాడి చేసి ఎత్తుకెళ్లారన్నారు. రెండు కేసులు సెంట్రల్ జోన్ పరిధిలోనే జరగడంతో డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్ ను అదుపులోకి తీసుకొని, అతడి వద్ద వాచ్ మెన్ మొబైల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
అతడిచ్చిన సమాచారంతో చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో మైనర్ ను పట్టుకొని, అడ్వొకేట్ ఫోన్‌ను రికవరీ చేసినట్లు , నిందితుల నుంచి బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆధార్ కార్డుల ఆధారంగా నిందితులను మైనర్లుగా గుర్తించామని, వయసు నిర్ధారణ కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు టెస్టుల కోసం పంపించామన్నారు. వీరిపై ముషీరాబాద్ పీఎస్ పరిధిలో ఇప్పటికే మరో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదైనట్లు తెలిపారు.
నిందితులను రిమాండ్ కు తరలించిన అనంతరం, కస్టడీకి తీసుకొని విచారిస్తామని ఏసీపీ తెలిపారు. అడ్వొకేట్ పై దాడి ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని స్పష్టం చేశారు. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు మైనర్లు మొబైల్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు చెప్పారు. అబిడ్స్ పీఎస్‌లో సైఫాబాద్ ఏసీపీ సంజయ్, ఖైరతాబాద్ సీఐ రాజశేఖర్, లోకల్ సీఐ రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.