
కాజీపేట, వెలుగు: కాజీపేటకు కేంద్రం మంజూరు చేసిన పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) వర్క్‌షాప్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భూమి కేటాయంచడం లేదని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శించారు. పీవోహెచ్ ఏర్పాటు చేస్తే బీజేపీకి పేరొస్తుందనే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న పీవోహెచ్ పనులను గురువారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న భూమిలో పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తుంటే, భూములు కేటాయించడంలో రాష్ట్రం విఫలం అవుతుందన్నారు. కాజీపేట అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్‌లో ఉన్న 10.17 ఎకరాల భూమిని కూడా వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. సుమారు 7 వేల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్‌పై నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఆమె వెంట బీజేపీ నాయకులు చిర్ర నర్సింగ్‌గౌడ్, గుంటి కుమారస్వామి, చాంద్‌పాషా, భగవాన్ ఉపాధ్యాయ, గంధసిరి శ్రీకాంత్, అరణ్యారెడ్డి, పెసరు తిలక్, కమల్, ఐనోశ్ తదితరులు పాల్గొన్నారు.