- అన్నదాతకు అండగా..
- అలుపెరగని పోరు జేసిన చరణ్ సింగ్
- ప్రధానిగా సేవలందించిన జాట్ లీడర్
- యూపీ సీఎం, మంత్రిగా కీలక బాధ్యతలు
- రైతుల కోసం కొత్త చట్టాల రూపకల్పన
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి
న్యూఢిల్లీ: దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ ఎంతో కృషి చేశారు. రైతులపై ఆయనకున్న అపారమైన ప్రేమాభిమానాలు.. దేశ ప్రధానిగా సేవ చేసేందుకు దోహదపడింది. దేశానికి రైతే వెన్నెముక అని పలుమార్లు గుర్తు చేసేవారు. దేశ ఆర్థిక వ్యవస్థ రైతులపైనే ఆధారపడి ఉంటుందని నమ్మేవారు. చరణ్‌సింగ్, దేశ ఐదో ప్రధానిగా జులై 28, 1979 నుంచి జనవరి 14, 1980 వరకు సేవలందించారు. యూపీ ఐదో సీఎంగా, ఆ తర్వాత మంత్రిగా పని చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి, డిప్యూటీ ప్రధానిగా కూడా చరణ్ సింగ్ సేవలందించారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో జాట్ లీడర్ చరణ్ సింగ్‌కు భారతరత్న వరించింది.
మధ్యతరగతి కుటుంబంలో జననం
1903, డిసెంబర్23న చౌధరి చరణ్ సింగ్ యూపీలోని మీరట్ జిల్లాలో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఆగ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అయిన సింగ్, న్యాయశాస్త్రంలో శిక్షణ పొంది ఘాజియాబాద్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత 1929లో మీరట్ కు షిఫ్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వాతంత్య్ర సంగ్రామంలో పాలు పంచుకున్నారు. బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత యూపీలో క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1937లో యూపీలోని చప్రౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కూడా అదే నియోజకవర్గం నుంచి 1946, 1952, 1962, 1967లో పోటీ చేసి విజయం సాధించారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు.
కేంద్ర మంత్రిగానూ సేవలు
యూపీలో 1946లో గోవింద్ వల్లభ్ పంత్ ప్రభుత్వంలో చౌధరి చరణ్ సింగ్ పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1951లో న్యాయ, సమాచార శాఖ మంత్రిగా సేవలు అందించేందుకు ముందు ఆయన పలు శాఖల్లో పనిచేశారు. 1967లో కాంగ్రెస్ ను వీడి సంయుక్త విధాయక్ దళ్ సంకీర్ణ నేతగా ఎన్నికై తొలిసారి యూపీ సీఎం అయ్యారు. 1970లో రెండోసారి సీఎంగా సేవలందించారు.
1979లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ సర్కార్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, డిప్యూటీ పీఎంగా ఉన్నారు. జనతా ప్రభుత్వం నుంచి జనసంఘ్ వైదొలిగిన తర్వాత.. కాంగ్రెస్ మద్దతుతో 1979, జులై28న ప్రధానిగా చరణ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, లోక్ సభలో తన మెజారిటీ నిరూపించుకోకముందే ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధాని పదవికి చరణ్ సింగ్ రాజీనామా చేశారు. 1980, జనవరి 14 వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగారు.
యూపీలో వ్యవసాయ రూపరేఖలు మార్చిన సింగ్
ప్రధానిగా పని చేసిన అతికొద్ది కాలంలోనే రైతులకు అనుకూలమైన చట్టాలను రూపొందించేందుకు చరణ్ సింగ్ కృషి చేశారు. యూపీలో వ్యవసాయం రూపురేఖలు మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. భూస్వాముల దోపిడీని ఎండగట్టేవారు. 1939లోనే రైతుల కోసం రుణ విముక్తి బిల్లు తీసుకొచ్చారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎంతోమంది రైతులకు ఇది రిలీఫ్ ఇచ్చింది. అన్నదాతల ఆత్మహత్యలను తగ్గించడంలో కీలక భూమిక పోషించారు.
నార్త్ ఇండియాలో జాట్లు, యాదవులు, గుజ్జర్లు, కుర్మీలు.. ఇలా అన్ని సామాజికవర్గ రైతులకు నాయకుడిగా ఎదిగారు. 1980, జనవరి 14న ఆయన తుది శ్వాస విడిచారు. రైతుల కోసం చేసిన సేవలకు గానూ రాజ్ ఘాట్‌లో ఆయన స్మారకానికి ‘కిసాన్ ఘాట్’ అని పేరు పెట్టారు. ఆయన జన్మదినాన్ని ‘కిసాన్ దివస్’గా జరుపుకుంటారు.