తెలంగాణలో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్​సిగ్నల్

తెలంగాణలో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్​సిగ్నల్
  • పర్మిషన్లు ఇవ్వాలని ఎన్ఎంసీకి కేంద్రం ఆదేశం
  • ఈ ఏడాది మొత్తం ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటు
  • ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున అందుబాటులోకి..
  • రాష్ట్రంలో 4,090కి పెరిగిన మొత్తం మెడికల్​ సీట్లు

హైదరాబాద్, వెలుగు : యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ (ఎన్​ఎంసీ)ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం లేఖ పంపింది. 

ఒక్కో కాలేజీలో‌‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మొత్తం ఎనిమిది కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4,090కి పెరిగాయి.

హాస్పిటల్, కాలేజీ భవనాలు, అవసరమైన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండానే కాలేజీల ఏర్పాటుకు గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ల కోసం ఎన్‌‌ఎంసీకి దరఖాస్తు చేసింది. తర్వాత ఎన్​ఎంసీ బృందం కాలేజీల పరిశీలనకు వచ్చింది. సరైన సౌలత్​లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులివ్వలేమని తేల్చి చెప్పింది.

రెగ్యులర్​గా మానిటర్ చేసిన మంత్రి దామోదర

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. కాలేజీల పర్మిషన్ల విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా రెగ్యులర్‌‌గా మానిటర్ చేశారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు స్టాఫ్‌‌ను నియమించారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్​ఫర్స్​లలో తొలుత ఆ నాలుగు కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే

మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌‌ను బదిలీ చేశారు‌‌. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇచ్చారు. కాలేజీ, హాస్పిట‌‌ల్‌‌లో ఉండాల్సిన ల్యాబోరేటరీ, డయాగ్నోస్టిక్ ఎక్వి‌‌ప్‌‌మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఇలా ఎన్‌‌ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు రెండో సారి అప్పీల్‌‌ చేశారు. 

ఢిల్లీ వెళ్లి మరీ విజ్ఞప్తి

సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశాలతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, ఇతర ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్య శాఖ, ఎన్‌‌ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.

దీంతో అన్ని కాలేజీలకు అనుమతులివ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ ‌‌చేయాలని ఎన్‌‌ఎంసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో‌‌ నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు.