దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత చాలా వరకు తగ్గిపోయింది. గడిచిన వారం రోజులుగా డైలీ కేసులు వేల సంఖ్యలో తగ్గాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. వారం రోజులుగా కేసులు తగ్గడంతో ఇక కరోనా ఆంక్షలను ఎత్తేయొచ్చని చెప్పింది. అన్ని రాష్ట్రాలు స్థానికంగా ఉన్న పరిస్థితులపై సమీక్ష చేసుకుని ఆంక్షలను పూర్తిగా రద్దు చేయడం లేదా కొంత మేర తగ్గించడం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆ లేఖలో సూచించారు.
Union Health Secretary Rajesh Bhushan writes to all States/UTs, asks them to review and amend or end additional COVID19 restrictions as the pandemic in the country shows a sustained declining trend pic.twitter.com/7iTlZ8tF4q
— ANI (@ANI) February 16, 2022
‘‘గత నెల 21 నుంచి దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత వారంలో డైలీ కేసులు సగటున 50,476గా నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజులో 27,409 కేసులు మాత్రమే వచ్చాయి. నిన్న డైలీ పాజిటివిటీ రేటు 3.63 శాతానికి పడిపోయింది’’ రాజేశ్ భూషణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా పరిస్థితిపై రివ్యూ చేసుకుని కరోనా ఆంక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే ఎక్కడా ఎకనమిక్ యాక్టివిటీకి, ప్రజల మూవ్ మెంట్ కు ఆటంకం కలిగించే అదనపు ఆంక్షలు లేకుండా చూడాలని చెప్పారు. అయితే రోజువారీగా పాజిటివిటీ రేటుపై మానిటర్ చేసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. మాస్కు పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి జాగ్రత్తలను ప్రజలంతా పాటించాలని కోరారు. అలాగే ప్రభుత్వాలు టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్.. విషయంలో ముందుకు సాగాలని రాజేశ్ భూషణ్ సూచించారు.