జమిలి జంఝాటం!

జమిలి జంఝాటం!

దేశంలో 2029 నుంచి లోక్‌‌సభతోపాటే అన్ని రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్‌‌ సిఫారసు చేసినట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ మేరకు రాజ్యాంగంలో ఒకే  దేశం, ఒకే ఎన్నికలు అనే కొత్త అధ్యాయాన్ని చేర్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిసింది. లా కమిషన్‌‌తో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా రాజ్యాంగాన్ని, ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్‌‌వర్క్‌‌ను మార్చటం ద్వారా జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చో అనే దానిపై నివేదికను రూపొందిస్తున్నది. తాజా పరిణామంతో ఏకకాల ఎన్నికలన్న అంశంపై ప్రస్తుతం  దేశవ్యాప్తంగా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.  బీజేపీ గతం నుంచి వాదిస్తున్నట్లు దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో పరిపాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఏకకాల ఎన్నికలు నిర్వహించాలని ప్రస్తుతం భావిస్తున్నది. కానీ,  కేంద్ర ప్రభుత్వ వాదనకు భిన్నంగా  వాదన సైతం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై మరింత లోతుగా తెలుసుకుందాం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి 1952, 57, 62, 67లలో  లోక్‌‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అయితే, ఆ తర్వాత ఎందుకు అన్ని రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌‌సభ ఎన్నికలతో జరగలేదు.  ఆర్టికల్‌‌ 356 ఉపయోగించి తొలిసారి అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం కేరళలోని నంబూద్రిపాద్​ కమ్యూనిస్టు సర్కారును 1957లో రద్దు చేసింది. అలా మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 356 ఆర్టికల్​కు బలయ్యాయి. దాంతో ఒకే సారి ఎన్నికలకు గండిపడింది. ఆ విధంగా  భారత రాజ్యాంగంలో ఆ ఆర్టికల్‌‌ ఉన్నంతకాలం ఒకేసారి ఎన్నికలు జరిగినా... మళ్ళీ రాష్ట్రాలపై కేంద్రానిదే పెత్తనమవుతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.  ఒకేసారి రాష్ట్రాలతో పాటు కేంద్రానికి ఎన్నికలు జరిగితే.. ఒకవేళ ఏదయినా రాష్ట్రానికి సరైన మెజారిటీ రాకపోయినా విశ్వాస పరీక్షలో నెగ్గని పరిస్థితుల్లో ఏం చేస్తారన్న దే కీలకం కానుంది.

రాజ్యాంగ సవరణ బీజేపీకి కష్టంకాదు

భారత రాజ్యాంగంలో పేర్కొన్నవిధంగా విశ్వాస పరీక్షలో  నెగ్గని ప్రభుత్వాన్ని ఆర్టికల్‌‌ 83(2) లోక్‌‌సభ, 172(1) అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. మరి ఒకేసారి ఎన్నికలు అని చెబుతున్న కేంద్రం ఆయా రాష్ట్రాల అసెంబ్లీ రద్దు అయ్యాక సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుందన్నది మిలియన్‌‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే కేంద్రం గవర్నర్‌‌ పేరిట పాలన విధించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు, సర్కారు చెప్పినట్టు లోక్‌‌సభ, శాసనసభల కాలపరిమితి పొడిగించడం, తగ్గించడం వంటి చర్యలు పూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అవుతాయి. అంటే, ఆయా అసెంబ్లీల ఎన్నికలయ్యే వరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం భావిస్తోందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది. 79వ పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిన ప్రకారం అసెంబ్లీల పదవీకాలాన్ని పెంచడం, తగ్గించడం రాజ్యాంగ మూలసూత్రాలు, వాటి స్ఫూర్తికి వ్యతిరేకమని గమనించాలి. ఏకకాల ఎన్నికలు జరపాలంటే, రాజ్యాంగాన్ని సవరించాలంటే ఉభయ సభలలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. ప్రభుత్వానికి లోక్‌‌సభలో మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీకి ప్రయత్నించవచ్చు. అయితే, ఈ విషయం కేంద్రంలోని బీజేపీకి పెద్ద కష్టం కాదని న్యాయకోవిదులు చెబుతున్నారు. ఈ ప్రక్రియకు 14 రాష్ట్రాల ఆమోదం అవసరం. బీజేపీ దాని మిత్రపక్షాలకు దాదాపు 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి.  ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌‌ లాంటి రెండు, మూడు రాష్ట్రాలు కలిసి రావడానికి సిద్ధంగా ఉంటాయన్నది సర్వత్రా తెలిసిందే. 

1983లోనే జమిలి ప్రయత్నాలు

జమిలి ప్రయత్నాలు 1983లోనే ప్రారంభమైనా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రతిపాదన తిరస్కరించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1999లో లా కమిషన్ సూచించింది. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలోనూ ఈ అంశం పేర్కొంది. 2016లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు. మరుసటి ఏడాది నీతి ఆయోగ్ ఒక నివేదిక సమర్పించింది. జమిలి ఎన్నికల కోసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని 2018లో లా కమిషన్ చెప్పింది. 2019లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మళ్లీ గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 2022లో దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం తెలిపింది. 2022 డిసెంబర్‌‌లో  లా కమిషన్ అన్ని పార్టీలను సంప్రదించి అభిప్రాయాన్ని కోరింది. వాస్తవానికి ప్రభుత్వం దీనికోసం చాలాకాలంగా సిద్ధమవుతోంది. కానీ, భౌతిక పరిస్థితులే అనుకూలించడం లేదు.

 తక్కువ దేశాల్లో జమిలి ఎన్నికలు 

సార్వత్రిక ఎన్నికలతోపాటు స్థానిక ఎన్నికలు జరిగే దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా దేశాలు జమిలి ఎన్నికలు నిర్వహిస్తాయి. కానీ, జనాభాపరంగా ఇవి ఇండియా కంటే చాలా చిన్న దేశాలు.  మన పొరుగు దేశం నేపాల్‌‌కు కూడా జమిలి ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉంది. 

విడి విడి ఎన్నికలతోనే ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తుంది

భారత్‌‌లో ఎన్నికలు నిర్వహించేందుకు రూ.4 వేల కోట్లను ఖర్చు పెట్టడం పెద్ద విషయమేమీ కాదని ఖురేషి గతంలో అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు ఈ వ్యయం రూ.60 వేల కోట్లవుతుంది. ఈ ఖర్చు కూడా ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని తెలిపారు. దీనివల్ల రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల చేతిలో ఉన్న నగదు పేద ప్రజలకు చేరుకుంటుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ బ్యానర్లను సిద్ధం చేయించడం నుంచి పోస్టర్లు ఏర్పాటు చేయడం, పబ్లిసిటీ మెటీరియల్‌‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వాహనాలపై ప్రచారం వరకు ప్రతీది చేస్తుంటారు. సామాన్య ప్రజలకు ప్రాధాన్యతను ఇచ్చే సమయం ఇదొక్కటేనని ఖురేషి చెప్పుకొచ్చారు. రాజకీయ నేతలు ఈ సమయంలోనే ప్రజల దగ్గరికి వెళ్తుంటారని, సామాన్య ప్రజలు కూడా ఇది పదే పదే కావాలనుకుంటారని వివరించారు.  ఈ ఏకకాల ఎన్నికల అంశంపై మరింత లోతైన చర్చ మాత్రం జరగాల్సిందే.

ఎన్నికల ఖర్చులు.. కహానీలు!

 ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో భారత్‌‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఒక సందర్భంలో చెప్పారు. భారత్‌‌లో ఎన్నికల సందర్భంగా ఒక్కో ఓటర్‌‌పై ఒక అమెరికా డాలర్‌‌ను అంటే రూ.83 ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించి పలు దేశాలలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం  కెన్యాలో ఈ ఖర్చు ఒక్కో ఓటరుపై 25 డాలర్లుగా ఉంది. అంటే రూ.2,077 వరకు ఖర్చు చేస్తున్నారు.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు కెన్యావే. భారత సరిహద్దు దేశం పాకిస్తాన్ సైతం గత జనరల్ ఎలక్షన్లలో ఒక్కో ఓటరుపై 
1.75 డాలర్లను అంటే రూ.145ను ఖర్చు చేసింది. 

5 ఆర్టికల్స్​లో సవరణలు అవసరం

జమిలి ఎన్నికల వల్ల దేశాభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని కొందరు అంటున్నారు. కొందరు మాత్రం అభివృద్ధి మందగిస్తుందని వాదిస్తున్నారు. ఇందుకు తొలుత రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్‌‌లో సవరణ అవసరం. అసెంబ్లీల పదవీకాలానికి, రాష్ట్రపతి పాలన నియమించడానికి ఉన్న ప్రొవిజన్లను మార్చాల్సి ఉంటుంది. ఇది మాత్రమేకాక, ప్రజా ప్రాతినిధ్య చట్టంతోపాటు సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఉన్న నిబంధనలను మార్చాలని ఎన్నికల కమిషనర్ చెప్పారు. అవిశ్వాస పరీక్షలను నిర్మాణాత్మకంగా ఉండేలా రూపొందించాల్సి ఉందన్నారు. అవిశ్వాస తీర్మానంతో పాటు ఏ ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో కూడా తెలపాలి.  దీనిపై  సభకు విశ్వాసం ఉండాలి. దీంతో, పాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వంతో లోక్‌‌సభ లేదా అసెంబ్లీ పదవీ కాలాన్ని ఐదేండ్ల పాటు కొనసాగించవచ్చు.

 


-  సాగర్​ వనపర్తి,పొలిటికల్​ ఎనలిస్టు