- ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై వరుస ఆరోపణలు
- మెడికల్ టెస్టులకూ డుమ్మా కొట్టినట్టు కథనాలు
- విచారణకు కేంద్రం కమిటీ
ముంబై: అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరకముందే లగ్జరీ సౌకర్యాలు కావాలని డిమాండ్ చేయడంతో వివాదంలో చిక్కుకున్న ప్రొబెషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ గురించి మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. పూజా ఖేద్కర్ తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్‌గా రిటైరయ్యారు. ఈ లెక్కన క్రీమీలేయర్ కిందకు వచ్చే పూజా ఖేద్కర్.. ఓబీసీ కోటాలో ఐఏఎస్‌గా ఎలా ఎంపికయ్యారనేది చర్చనీయాంశంగా మారింది. తప్పుడు పత్రాలతో ఆమె ఉద్యోగం పొందినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మెడికల్ టెస్టులకు డుమ్మా కొట్టుడేంది?
మరో వివాదం కూడా పూజ ఖేద్కర్‌ను చుట్టుముడుతోంది. కంటి, మానసిక సమస్యలున్నట్లు పూజ అఫిడవిట్ సమర్పించినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిపై వైద్య పరీక్షలకు కావాలనే ఆమె ఆరు సార్లు డుమ్మాకొట్టారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురువారం మీడియా ముందుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడేందుకు ప్రభుత్వ అనుమతి లేదని, ప్రస్తుతం మహారాష్ట్రలోని వాషిమ్‌లో కొత్త పాత్ర పోషించడం హ్యాపీగా ఉందన్నారు. కాగా, పూజపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. రెండు వారాల్లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
పుణె నుంచి వాషిమ్‌కు ట్రాన్స్ఫర్..
సివిల్స్‌లో 841 ర్యాంక్‌తో ఐఏఎస్ సాధించిన పూజా ఖేద్కర్ పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా చేరకముందే తన ప్రైవేట్ ఆడి కారుకు రెడ్, బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్ ప్లేటు, రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ అమర్చారు. అంతేకాకుండా తనకు ప్రత్యేక వసతులు, తగినంత సిబ్బంది, కానిస్టేబుల్, అధికారిక చాంబర్ కేటాయించాలని పట్టుబట్టారు. దీంతో పూజ మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ పుణె కలెక్టర్ రాష్ట్ర సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పుణె నుంచి వాషిమ్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రొబెషన్ కాలం పూర్తయ్యేదాకా ఆమె అక్కడే పనిచేయాలని సీఎస్ ఆదేశించారు.