
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ద్వంద పౌరసత్వం కేసులో అలహాబాద్ హైకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నాలుగు వారాల డెడ్ లైన్ విధించింది. నాలుగు వారాల్లోగా రాహుల్ గాంధీ ద్వంద పౌరసత్వం ఇష్యూపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. కాగా, కర్ణాటకకు చెందిన విఘ్నేష్ శిశిర్ అనే న్యాయవాది రాహుల్ గాంధీకి ద్వంద పౌరసత్వం ఉందని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
భారత్తో పాటు బ్రిటన్లో కూడా రాహుల్ గాంధీకి పౌరసత్వం ఉందని విఘ్నేష్ శిశిర్ ప్రధాన ఆరోపణ. ‘‘రాహుల్ గాంధీకి బ్రిటన్లో కూడా పౌరసత్వం ఉందని మాకు సమాచారం ఉంది.. ఈ మేరకు ఆ దేశం నుంచి మాకు రహస్య మెయిల్స్ వచ్చాయి. అందుకు సంబంధించిన అన్ని వివరాలను కోర్టుకు సమర్పించాం’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. భారత చట్టాల ప్రకారం ద్వంద్వ పౌరసత్వం అనుమతించబడదు. ఎవరైనా మరొక దేశం పౌరసత్వాన్ని తీసుకున్న తర్వాత భారత పౌరసత్వం రద్దు చేయబడుతుంది.
ALSO READ | జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు: బార్ కౌన్సిల్ వ్యతిరేకించినా.. అలహాబాద్ హైకోర్టుకే జస్టిస్ వర్మ..
భారత చట్టాలకు విరుద్ధంగా డ్యుయెల్ సిటిజన్షిప్ కలిగి ఉన్న రాహుల్ గాంధీ పౌరసత్వం ఇష్యూపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో కోరాడు విఘ్నేష్ శిశిర్. ఈ పిటిషన్పై సోమవారం (మార్చి 24) విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా రాహుల్ గాంధీ పౌరసత్వంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
దీంతో రాహుల్ సిటిషన్షిప్పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాహుల్ గాంధీ ద్వంద పౌరసత్వం వార్తలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ భారతీయుడని.. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడనే దేశ ప్రజలందరికి తెలుసని రాహుల్ సోదరి, ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ద్వంద పౌరసత్వం పేరుతో నా పేరును కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.