జమ్మూకాశ్మీర్ ఎల్జీకి మరిన్ని పవర్స్

  • ఐఏఎస్, ఐపీఎస్​ల బదిలీలు, పోస్టింగ్స్ ఆయన చేతుల్లోనే.. 
  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పోలీసులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు,  పోస్టింగ్స్ తో పాటు అడ్వొకేట్ జనరల్, లా ఆఫీసర్లను నియమించే అధికారాలను ఆయనకే అప్పగించింది. ఇందుకోసం జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్–2019లో సవరణలు చేసింది. ఈ సవరణలకు రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘‘ఇంతకుముందు లాగా పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఆలిండియా సర్వీస్, ఏసీబీ వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు. ఈ వ్యవహారాలపై చీఫ్ సెక్రటరీ ఫైల్స్ ను ఎల్జీకి పంపించాల్సి ఉంటుంది” అని అందులో పేర్కొంది. ‘‘ఇకపై అడ్వొకేట్ జనరల్, లా ఆఫీసర్లను ఎల్జీ నియమిస్తారు. ఇందుకోసం ప్రపోజల్స్ ను సీఎం, సీఎస్ ద్వారా డిపార్ట్ మెంట్ ఆఫ్ లా, జస్టిస్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ పంపించాలి. అదే విధంగా ఏదైనా కేసుల్లో విచారణ అనుమతులు, అప్పీల్స్ దాఖలు కోసం సీఎస్ ద్వారా డిపార్ట్ మెంట్ ఆఫ్ లా, జస్టిస్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ ప్రపోజల్స్ ను ఎల్జీకి పంపించాలి” అని తెలిపింది. ఇక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన ప్రపోజల్స్ ను చీఫ్ సెక్రటరీ ద్వారా ఎల్జీకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ పంపించాలని చెప్పింది. కాగా, త్వరలోనే జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నది. అందులో భాగంగానే ఎల్జీకి మరిన్ని పవర్స్ ఇచ్చిందని తెలుస్తున్నది. 

కేంద్రంపై ప్రతిపక్షాల ఫైర్.. 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది జమ్మూకాశ్మీర్ ప్రజల అధికారాలను లాక్కోవడమేనని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ మండిపడ్డాయి. కేంద్రం తన నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని కాంగ్రెస్ అభివర్ణించింది. ‘‘జమ్మూకాశ్మీర్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పేందుకు కేంద్ర నిర్ణయమే నిదర్శనం. కానీ ఈ నిర్ణయంతో సీఎం పవర్ లెస్, రబ్బర్ స్టాంప్ గా మిగిలిపోతరు. సీఎం తన ప్యూన్ ను నియమించుకోవడానికి కూడా ఎల్జీని అడుక్కోవాల్సిన దుస్థితి వస్తుంది” అని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.