ఢిల్లీ: బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని లోక్‌సభలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ది మండలి-ఎన్‌డిసి ఐదు నిబంధనలు పెట్టిందని.. ఆ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఆర్ధిక శాఖ తేల్చి చెప్పింది. ఆ నిబంధనల ప్రకారం... గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించినట్లు కేంద్రం గుర్తుచేసింది. గతంలో బీహార్‌కు ప్రత్యేక హోదా అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం అధ్యయనం చేసి... 2012 మార్చి 30 నివేదిక ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఎన్‌డిసి నిబంధనల ప్రకారం బీహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని 2012లో అంతర్ మంత్రిత్వ శాఖల బృందం నివేదిక తేల్చి చెప్పిందన్న కేంద్రం వెల్లడించింది.
జెడియు లోక్‌సభ సభ్యుడు రామ్‌ప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో మిత్రపక్షంగా కొనసాగుతున్న జేడీయూకు ఈ ప్రకటన పెద్ద షాక్ అని చెప్పక తప్పదు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కు కేంద్రం ఝలక్ ఇచ్చిందని జాతీయ మీడియా ఇప్పటికే కోడై కూస్తున్న పరిస్థితి. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేక హోదా అంశంపై ఒత్తిడి తీసుకురావాలని, కేంద్రం నుంచి సానుకూల ప్రకటన చేయాలని జేడీయూ భావించింది. కానీ.. కేంద్రం బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో నితీష్ కుమార్ సందిగ్ధంలో పడినట్టయింది.
Also Read:-కల్తీ ఆహారం, AI సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న జేడీయూ ప్రధాన డిమాండ్ ను కేంద్రం బుట్టదాఖలు చేయడంతో నితీష్ కుమార్ కూటమి నుంచి తప్పుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఇక.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ముందు ఇప్పటికే చాలాసార్లు లేవనెత్తాయి. కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రత్యేక హోదా అంశం రాజకీయ ప్రచారాస్త్రంగా మిగిలిపోయిందే తప్ప కార్య రూపం దాల్చలేదు. ‘ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం’ అని కేంద్రం చెబుతున్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ భయం ఉందని, అందువల్ల టీడీపీ ప్రత్యేక హోదాపై పట్టుబట్టాలని ప్రత్యేక హోదా సాధన సమితి సూచిస్తోంది.