తెలంగాణను గుల్ల చేస్తున్న మైనింగ్​

తెలంగాణను గుల్ల చేస్తున్న మైనింగ్​

మైనింగ్ అనేక రకాల ఖనిజాల కోసం చేస్తున్నారు.  ఖనిజాల వెలికితీత అభివృద్ధి, ఆర్థిక రంగాలకు కీలకంగా మారింది. నిత్యం మైనింగ్ లేనిదే మనలేని స్థితికి ఆధునిక జీవన విధానం చేరుకున్నది. ఇటీవల జరుగుతున్న వాతావరణ మార్పులు, పెరుగుతున్న భూఉష్ణోగ్రతల నేపథ్యంలో జరుగుతున్న అంతర్జాతీయ చర్చలు మైనింగ్ మీదనే కేంద్రీకరించి ఉన్నాయి. శిలాజ ఇంధనాల వాడకం క్రమంగా, పూర్తిగా ఎత్తివేయాలని అంతర్జాతీయ వాతావరణ సదస్సులలో  ధనిక,  అభివృద్ధి చెందిన దేశాల మీద ఒత్తిడి పెరుగుతున్నది. శిలాజ ఇంధనాలను మండించే చర్యలు తగ్గించడం ద్వారానే  ప్రకృతి వినాశనం తగ్గించవచ్చని అనేక శాస్త్రీయ నివేదికలు చెబుతున్నాయి. 

ప్రత్యామ్నాయాల్లో ఒక పరిష్కారంగా భావిస్తున్న సౌరశక్తికి,  విద్యుత్  వాహనాల కోసం కూడా ఆయా ఖనిజాల మైనింగ్ అవసరం ఏర్పడింది. ఆ మేరకు ఇవి ప్రత్యామ్నాయాలే కావని పర్యావరణవేత్తలు ఆందోళన.  ఖనిజాల మైనింగ్ అంతగా పెనవేసుకుపోయింది.  మైనింగ్ అవసరం లేని పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ, దానిని నియంత్రించాలని మాత్రం ఏకాభిప్రాయం ఉన్నది. ప్రకృతిని కాపాడుతూ, రక్షణ చర్యలు చేపడుతూ ఖనిజాల వెలికితీత  నిదానంగా, సమతుల్యంగా  చేపట్టాలని కోరుతున్నారు.

మైనింగ్​ రంగంపై ప్రభుత్వ ఆశలు

భారతదేశంలో కరోనా మహమ్మారి తరువాత, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి బొగ్గుతో సహా మైనింగ్ రంగంపై భారత ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నది.  మైనింగ్ రంగం చరిత్ర చూస్తే.. ఆదివాసీలు, పేదలు అన్యాయానికి గురి అయిన పరిస్థితి కనపడుతుంది. మైనింగ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యం పూర్తిగా అధ్వానంగా ఉంటుంది.  ప్రకృతి వనరులు అన్ని కలుషితం అవుతాయి.  సాధారణ జీవనం  ఉండదు. మనుషులు, మర పరికరాలు, పెద్ద లారీలు, భారీయంత్రాలు తప్పితే ఇతర జీవజాలం ఉండే అవకాశాలు మృగ్యం.  పర్యావరణంపై తీవ్ర హానికరమైన ప్రభావం కూడా ఉంటుంది.  మైనింగ్ వల్ల  కొన్ని ప్రాంతాలు పూర్తిగా ఎడారులుగా మారినాయి. 

85 ఖనిజాల మైనింగ్

అధికారిక ప్రభుత్వ సమాచారం ప్రకారం.. దేశంలో బొగ్గు, లిగ్నైట్, బాక్సైట్, క్రోమైట్, రాగి, ఇనుము, సీసం, జింక్, మాంగనీస్, వెండి, వజ్రం, సున్నపురాయి, ఫాస్ఫోరైట్ మొదలైనవాటితో సహా 85 ఖనిజాల మైనింగ్ అవుతుంది. ప్రపంచంలో భారతదేశం మైనింగ్ రంగంలో రెండవ స్థానంలో ఉంది.  ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, దిగుమతిదారు దేశం మనదే.  దశాబ్దాలుగా,  ఖనిజ ఉత్పత్తి విలువ కూడా పెరిగింది. 2015-–16 నాటికి దాని విలువ దాదాపు రూ.2.82 లక్షల కోట్లు.  దేశంలో 23 రాష్ట్రాలలో 3,16,290.55 హెక్టార్ల విస్తీర్ణంలో 3,500 మైనింగ్ లీజులు అమలులో ఉన్నాయి. వాటిలో దాదాపు 70 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్ (702 మైనింగ్ లీజులు), తమిళనాడు (464), ఆంధ్రప్రదేశ్ (453), గుజరాత్ (432),  కర్ణాటక (376). జార్ఖండ్, ఒడిశా, చత్తీస్​గఢ్​ రాష్ట్రాలలో కూడా గనులు, ఆదాయం గణనీయంగా ఉన్నది.  గనుల సమాచారం పూర్తిగా అందుబాటులో ప్రజలకు లేదు. ప్రభుత్వాలకు పట్టింపు లేదు. ఖనిజాల అన్వేషణ మీద అన్ని రాష్ట్రాలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు తమ గనుల ఆదాయం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. భారీ అప్పుల బారి నుంచి తప్పించుకునే క్రమంలో గనుల ఆదాయం ఒక మార్గంగా కనపడుతున్నది. 

మైనింగ్​ యూనిట్ల వల్ల కాలుష్యం

తెలంగాణ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ కేవలం ఇసుక అమ్మకాల ద్వారా 2014 నుంచి 2022 మధ్య  రూ.5,072.76 కోట్లు ఆర్జించింది. తెలంగాణ శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా 2014-–15 నుంచి 2018-–19 మధ్య మైనింగ్ రెవెన్యూ  రూ. 15,787.68 కోట్లు  ఆర్జించినట్లు ప్రభుత్వం చెప్పింది. 2011–-12 నుంచి 2016-–17 మధ్య వచ్చిన ఆదాయం రూ.12,457 కోట్లు.  మైనింగ్ ఆదాయం పెరుగుతున్నట్లు కనపడుతున్నా, పూర్తి స్థాయిలో ప్రభుత్వం మైనింగ్ టాక్స్ వసూలు చేయడం లేదు. జాతీయ హరిత  ట్రిబ్యునల్ ముందు ఉన్న పర్యావరణ కాలుష్యం కేసుల్లో ఎక్కువ శాతం అనుమతి లేని మైనింగ్ యూనిట్ల గురించే.  

రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో,  పక్కనే ఉన్న యాదాద్రి జిల్లా పరిధిలో దాదాపు 28 అనుమతిలేని రోడ్ మెటల్ గనులు, క్రషింగ్ యూనిట్లు ఉన్నాయని ప్రజలు  ప్రభుత్వ దృష్టికి అనేకమార్లు తీసుకువచ్చినా, వాటి మీద చర్యలు శూన్యం. కనీసం టాక్స్ కూడా వసూలు చేయడం లేదు. ఒక అంచనా ప్రకారం కేవలం 2 స్టోన్ మైనింగ్ క్రషింగ్ యూనిట్ల వల్ల సంవత్సరానికి 28,616 క్వింటాళ్ల దుమ్ము గాలిలో కలుస్తున్నది. దీనిని బట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని మైనింగ్ యూనిట్ల వల్ల ఎంత దుమ్ము గాలిలోకి చేరుతుందో అంచనా వేయవచ్చు. 

ఖనిజాల లభ్యత మీద..తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయాలి

గనుల వల్ల నష్టపోతున్న స్థానికులకు విధిగా ఇవ్వాల్సిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులు (DMRF) కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. గనుల వల్ల నష్టపోతున్న గ్రామాలు, కుటుంబాల ‘అభివృద్ధి కోసం సేకరిస్తున్న DMRF నిధులను పూర్తిస్థాయిలో సేకరించడం లేదు. పక్కదారి పడుతున్నాయి. చట్టపరంగా చేయాల్సిన ఈ నిధుల సేకరణలో, ఉపయోగంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి నిర్లక్ష్యం కనపడుతోంది. గత ప్రభుత్వం చేసి పోయిన అప్పుల భారం, ఇంకా అనేక రకాల ‘భారాల’ వల్ల తెలంగాణ ప్రభుత్వం మైనింగ్ ఆదాయం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. 

ఇప్పటివరకు అనుమతి లేని స్టోన్ క్రషింగ్, ఇంకా ఇతర ఖనిజ పరిశ్రమల వల్ల జరిగిన కాలుష్యం, దానివలన జరిగిన నష్టం నిర్లక్ష్యం చేసి, వాటికి అనుమతులు ఇచ్చి ఆదాయం పొందే ప్రయత్నం జరిగే అవకాశం ఉన్నది. మైనింగ్ మీద తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఆలోచన చెయ్యాలి. అనుమతి లేకుండా మైనింగ్ చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, వారికి సహకరించిన అధికారులు, రాజకీయ నాయకుల మీద చర్యలు చేపట్టాలి.  మైనింగ్ వల్ల నష్టపోయిన, నష్టపోతున్న ప్రజలకు పరిహారం చెల్లించాలి. ఆయా ప్రాంతాలలో ప్రకృతి సంరక్షణ చర్యలు చేపట్టాలి. తెలంగాణాలో ఖనిజాల లభ్యత మీద అధ్యయనాలు చెయ్యాలి.

గనులు, ఖనిజాల చుట్టూ రాజకీయాలు

దేశం రెండంకెల వృద్ధి రేటును చేరుకోవాలంటే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి భారత గనుల రంగం రెండింతల కంటే ఎక్కువ పెరగాలి అని భారత వాణిజ్య సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పుడు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నదని వాపోతున్నారు కొందరు ఆర్థికవేత్తలు. భారతదేశంలో ముఖ్యమైనది నార్త్ ఈస్టర్న్ పెనిన్సులర్ ఖనిజ బెల్ట్ (ఈశాన్య గనుల ప్రాంతం). ఇందులో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. చత్తీస్​గఢ్​కూడా ఒక ముఖ్యమైన ఖనిజాల ప్రాంతం. ఇక్కడి రాజకీయాలు గనులు, ఖనిజాల చుట్టూ ఉంటాయి.  మైనింగ్​ ఆగిపోవాలని ఒకవైపు స్థానికులు కోరుతుంటే, దేశ, రాష్ట్ర రాజధానులలో దాని వల్ల లబ్ధి పొందుతున్నవాళ్ళు ఇంకా గనులు పెరగాలంటున్నారు. పర్యవసానంగా స్థానికులు నిర్వాసితులు అవుతారు. పర్యావరణం ఇంకా దెబ్బ తింటుంది. మరి, గనుల రంగం పెరగాలని భావిస్తే ప్రభుత్వం స్థానికుల పునరావాసానికి తగిన విధానాలు, నిధులు ఇస్తుందా? అట్లాంటి ప్రణాళికలు ఉన్నాయా అంటే.. ఖచ్చితంగా లేవు. 

మైనింగ్​ దేశాల్లో ప్రజాస్వామ్యం కరువు

కరెంటు కోసం వెంపర్లాడే నగర జనాభాకు,  విద్యుత్​ను  దుబారాగా  వాడేసే  నిర్లక్ష్య మనుషులకు, ఆ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు వెలికితీత ఎంత భయానక పరిస్థితుల్లో ఉంటుందో తెలిసే అవకాశం లేదు. కానీ,  తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.  మైనింగ్ మీద ఆధారపడ్డ  దేశాలలో ప్రజాస్వామ్యం కొరవడడం సాధారణం. ఐరోపా దేశాలు వలసవాదం మొదలుపెట్టి, దేశాలను ఆక్రమించేదే..  వారి అభివృద్ధి దాహం తీర్చే మైనింగ్ కోసం. అనేక ఆఫ్రికా దేశాల్లో వందల ఏండ్ల నుంచి అభివృద్ధి చెందిన దేశాలు తమకు అనుకూలమైన రాజకీయాలు, హింసను ప్రేరేపించడం చరిత్రలో లిఖితమే.

- డా. దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​ పాలసీ వాచ్​