వికిపీడియాకు కేంద్రం నోటీసులు

వికిపీడియాకు కేంద్రం నోటీసులు
  • మిమ్మల్ని పబ్లిషర్ గా ఎందుకు చూడకూడదని వికిపీడియాకు కేంద్రం ప్రశ్న
  • విచారణ నేటికి వాయిదా

న్యూఢిల్లీ: ఇంటర్ నెట్ లో ఉచితంగా దొరికే ప్రముఖ ఆన్ లైన్  ఎన్ సైక్లోపేడియా వికిపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. పక్షపాత ధోరణి చూపుతున్నారని, సరైన సమాచారం ఇవ్వడం లేదన్న ఫిర్యాదులపై కేంద్రం ఈ మేరకు చర్యలు తీసుకుంది. మిమ్మల్ని మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్ గా ఎందుకు చూడకూడదని వికిపీడియాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రశ్నించింది. వికిపీడియాలో ఎంట్రీలను ఎడిట్  చేసిన యూజర్ల సమాచారం అడిగితే ఇవ్వడం లేదని, సమాచారం ఇచ్చేలా ఆ సంస్థను ఆదేశించాలని కోరుతూ ఏషియన్  న్యూస్  ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ).. ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ‘‘ఫ్రీ ఎన్ సైక్లోపేడియాలోనే సమాచారం దొరుకుతున్న నేపథ్యంలో సమాచార పబ్లిషర్  అని కాకుండా మధ్యవర్తి అని మీరు (వికిపీడియా) చెప్పుకుంటున్నారు. అటువంటపుడు ఇతరులు కోరిన సమాచారాన్ని ఎలా తిరస్కరిస్తారు? మీరు మధ్యవర్తి అయితే, సమాచారం ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తున్నారు?” అని జస్టిస్  సుబ్రమణియన్  ప్రసాద్  ప్రశ్నించారు. కంటెంట్ కు ఆమోదం తెలపకుండానే ఎన్ సైక్లోపేడియాగా చెప్పుకోవడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. 

అయితే, సెకండరీ సోర్సెస్  నుంచి సమాచారం తీసుకున్న విషయాన్ని యూజర్లకు తెలియజేశామని వికిపీడియా తరపు న్యాయవాది చెప్పారు. ప్రజలకు సమాచారం అందించే విషయంలో వికిపీడియాను పబ్లిషర్ గా కాకుండా మధ్యవర్తిగానే చూడాలని అడ్వొకేట్  చేసిన వాదనను జస్టిస్  సుబ్రమణియన్  తప్పుపట్టారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. కాగా.. ఎడిట్  చేసిన యూజర్ల గురించి సమాచారం ఇవ్వనందుకు వికిపీడియాకు హైకోర్టు గత నెలలో కూడా నోటీసులు పంపింది. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండడం ఇష్టం లేకపోతే, దేశంలో పనిచేయవద్దని చీవాట్లు పెట్టింది. సమాచారం ఇవ్వకపోతే, సైట్ ను బ్లాక్  చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.