మోదీ సర్కార్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద,.. చిన్న, సన్నకారు రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తుంది కేంద్రం. పెట్టుబడి సాయం కింద వీటిని నేరుగా.. రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ మొత్తాన్ని పెంచాలనే ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేల రూపాయలను.. 8 వేల రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తుంది. దీనిపై అతి త్వరలోనే.. అంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే.. ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read : ఎలా సంపాదిస్తున్నార్రా : గుట్టలుగా డబ్బులు, 100 ఫేక్ నెంబర్ ప్లేట్స్
చిన్న రైతులకు ఇచ్చే నగదు మొత్తాన్ని మూడింట ఒక వంతు పెంచే ప్రణాళికను కేంద్రం పరిశీలిస్తోంది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార పార్టీ ఎన్నికలకు ముందే దీన్ని పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక ఆమోదం పొందితే.. ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమం కోసం రూ.60వేల కోట్లు కేటాయించినట్టు సమాచారం. అయితే దీనిపై స్పందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నాను భాసిన్ నిరాకరించారు.
దేశంలోని 1.4బిలియన్ల జనాభాలో దాదాపు 65శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోన్న మోదీ.. కొన్ని రోజులకు పేద కుటుంబాలకు మద్దతుగా పలు చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత ధాన్యాల కార్యక్రమాన్ని వచ్చే ఏడాదికి పొడిగించడంతో పాటు చిన్న పట్టణ గృహాల కోసం సబ్సిడీ రుణాలను పరిగణలోకి తీసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి. వంటకు ఉపయోగించే పెట్రోలియం గ్యాస్‌పై సబ్సిడీల పెంపునకు ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపింది.