దిఘా (బెంగాల్): బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని.. ఇప్పటికైనా కేంద్రం స్పందించి వాటిని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. జగన్నాథ ఆలయ నిర్మాణ పనులను సమీక్షించడానికి సీఎం మమత మూడ్రోజుల పాటు దిఘాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ విలేకర్లతో ఆమె మాట్లాడారు.
“కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు రక్షణ కల్పించేలా అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. భారత్‌కు తిరిగి రావాలనుకునే వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. భారత ప్రభుత్వం తమ బాధ్యతగా ఒక ప్రతినిధిని పంపించింది. బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది తిరిగి వచ్చేలా వీసాల సంఖ్యను కూడా పెంచింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ముస్లిం మతపెద్దలు కూడా ఖండించారు. వారికీ రక్షణ కల్పించాలని కోరారు” అని మమత పేర్కొన్నారు.