కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. జాతీయ బీసీ కమిషన్ పదవీ కాలం ఫిబ్రవరి 2022కు పూర్తయినప్పటికీ నేటివరకు కమిషన్ చైర్మన్, ఒక్క సభ్యుడిని మాత్రమే నియమించింది. పూర్తిస్థాయి కమిషన్ లేనందువల్ల జాతీయ బీసీ కమిషన్ పనివిధానం కుంటి నడకన నడుస్తోంది. సుప్రీంకోర్టు 1992లో మండల్ కమిషన్ తీర్పులో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు, జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ 1993లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. అట్టి కమిషన్‌కు జాతీయ ఓబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చుట లేదా తీసివేయుట వంటి అధికారానికి మాత్రమే పరిమితం చేశారు. అప్పటికే జాతీయస్థాయిలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూలు తెగలకు జాతీయ స్థాయి కమిషన్లను రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేశారు. కమిషన్లకు ఏదైనా కులాన్ని ఎస్సీ జాబితాలో లేదా ఎస్టీ జాబితాలో చేర్చుట లేదా తొలగించుట అధికారాలు కల్గి ఉండి దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కులాలపై జరుగుతున్న అత్యాచారాలపై, రిజర్వేషన్లు అమలు తీరుపై, ఇతర సమస్యలపై పర్యవేక్షించి సరైన సూచనలు సలహాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే అధికారాలు రాజ్యాంగబద్దంగా కలిగి ఉన్నాయి. కానీ, నాటి జాతీయ బీసీ కమిషనుకు అలాంటి రాజ్యాంగబద్ధమైన హోదా, అధికారాలు లేవు.
మొదటి జాతీయ బీసీ కమిషన్
బీజేపీ ప్రభుత్వం 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 338బి, 342ఎ, 366(26సి)లను చేర్చి దేశంలో 50 శాతానికి పైగా ఉన్న సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తెచ్చింది. అందులో భాగంగా ఫిబ్రవరి 2019లో 338బి అధికరణ ప్రకారం మొదటి జాతీయ బీసీ కమిషన్ ను మూడు సంవత్సరాల కాలపరిమితితో ఏర్పాటు చేస్తూ చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులచే పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఓబీసీ కులాల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసింది. ప్రధానంగా కేంద్రీయ నవోదయ, సైనిక్ స్కూల్స్, హిందూ బాలుర బాలికల పాఠశాలల్లో, జాతీయ న్యాయ కళాశాలల్లో, 15% జాతీయ స్థాయి మెడికల్ సీట్ల కోటాలో 27% రిజర్వేషన్లను అమలు చేయడానికి చర్యలు తీసుకుంది. అప్పటివరకు కేంద్రీయ విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల పర్యవేక్షణలేని కారణంగా వేల సంఖ్యలో సీట్లను కోల్పోయారు. 2019లో రాజ్యాంగబద్ధమైన హోదా కల్గిన జాతీయ బీసీ కమిషన్ ఏర్పడి చొరవ తీసుకున్నందువల్ల నేడు వేల సంఖ్యలో ఓబీసీ విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందుతున్నారు.
పూర్తిస్థాయి చైర్మన్, సభ్యులను నియమించాలి
కేంద్ర బీజేపీ ప్రభుత్వం డిసెంబర్ 2022లో హన్సరాజ్ గంగారాం అహిర్‌ను చైర్మన్‌గా, మార్చి 2023లో భువన్ భూషణ్ కమల్‌ను సభ్యునిగా మాత్రమే నియమించి పూర్తిస్థాయి కమిషన్ సభ్యులను నియమించలేదు. అందువల్ల నేడు వేల సంఖ్యలో బీసీ కమిషన్‌కు ఫిర్యాదులు అందుతున్నా పరిష్కరించలేని పరిస్థితిలో కమిషన్ పనితీరు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా శాశ్వత ప్రాతిపదికన కమిషన్లు ఏర్పాటు చేసి అందులో నిష్ణాతులైన చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించి ప్రజలకు న్యాయం చేయాలి. కానీ, నేటి ప్రభుత్వాలు కమిషన్లను రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మార్చారు. అందుకే పూర్తిస్థాయిలో రాజ్యాంగబద్ధమైన న్యాయ పరిష్కారాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు పొందలేకపోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కులాల చిరకాల డిమాండ్ అయిన జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించి న్యాయం చేశారు. కానీ, శాశ్వత ప్రాతిపదికన చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులను నియమించి ఓబీసీ కులాల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
- కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం