
న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ టూరిజం సర్క్యూట్ కింద పెద్దపల్లిలోని రామగిరి కోట, ధూళికట్ట బౌద్ధ స్తూపాన్ని ప్రొత్సహించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు ప్రాంతాలు తెలంగాణ ప్రభుత్వంలోని హెరిటేజ్ శాఖ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. అందువల్ల రామగిరి కోట, ధూళికట్ట బౌద్ధ స్తూప పరిరక్షణ తమ బాధ్యత కాదంటూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు.
వీటి అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి, ధూళికట్ట బౌద్ధ స్తూప పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కేంద్రం దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా? అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు. వీటికి సంబంధించిన సమాచారం, నేషనల్ టూరిజం సర్క్యూట్ కింద చేపట్టిన పనుల వివరాలు కోరారు.
ఈ రెండు ప్రాంతాల అభివృద్ధికి తమ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని కేంద్రం వెల్లడించింది. అయితే, స్వదేశ్ దర్శన్ స్కీం 2.0 కింద తెలంగాణలోని ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ స్కీం కింద భువనగిరి ఫోర్ట్, ఎక్స్‌పీరియన్షల్ జోన్‌ను మంజూరు చేశామని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్ఏ ఎస్సీఐ కింద రామప్ప రీజన్ సస్టైనబిలిటీ టూరిజం సర్క్యూట్ కింద రూ.73.74 కోట్లు అప్రూవ్ చేసినట్లు వెల్లడించారు.