పాలమూరు – -రంగారెడ్డి లిఫ్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేం

పాలమూరు – -రంగారెడ్డి లిఫ్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేం
  • న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని దాటవేసిన కేంద్రం
  • లోక్ సభలో ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నకు సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనే ఏపీ విభజన చట్టం – 2014లోని హామీకి కేంద్ర ప్రభుత్వం మరోసారి తూట్లు పొడిచింది. పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు జాతీయ హోదా విజ్ఞప్తిని పక్కన పెట్టింది. న్యాయపర చిక్కులు, టెక్నికల్ అంశాలను చూపుతూ గురువారం లోక్ సభ వేదికగా జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పింది. ఏపీ, తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ లోక్ సభలో లేవనెత్తారు.

తెలంగాణలోని పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీంకు జాతీయ హోదా ఇచ్చే ఆలోచన ఉందా? లేకపోతే కారణాలు తెలపాలని ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్ భూషన్ చౌదరి రాత పూర్వక సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఏ ఒక్క ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా లేదని స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం పాలమూరు – రంగా రెడ్డి స్కీంకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వాలని కోరిందని చెప్పారు. కానీ, జాతీయ హోదా ఇవ్వాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ), ఇతర కమిటీలు ఆమోదం తెలపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

న్యాయపర చిక్కులు ఏమిటంటే.. 

పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సెప్టెంబర్ 2022లో సాంకేతిక, ఆర్థిక అంచనాల కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి పంపిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే, జాతీయ హోదా ఇవ్వాలంటే ముందుగా సీడబ్ల్యూసీ సంబంధిత ప్రాజెక్టు సాంకేతిక, -ఆర్థికపరమైన అంశాలను అంచనా చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నీటి పారుదల, వరదల నిర్వహణ, బహుళార్థక సాధక ప్రాజెక్టుల సలహా కమిటీ ఆమోదించాల్సి ఉంటుందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణా నది జలాల వినియోగంపై ఆధారపడి నిర్మించనున్న ప్రాజెక్ట్ అని తెలిపారు.

అలాగే, కృష్ణా నది జలాల వివాద ట్రిబ్యునల్ -II టెర్ట్మ్ అప్ రిఫరెన్స్​లో ఉన్న అంతర్రాష్ట్ర అంశాలతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ముడిపడి ఉందన్నారు. దీంతో కృష్ణానది వివాదాల అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని, అందువల్ల ప్రస్తుతానికి సాంకేతిక ఆర్థిక అంచనా సాధ్యం కాదని, ఈ ప్రక్రియ చేయకుండా జాతీయ హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కాగా.. విభజన చట్టం ప్రకారం ఇప్పటికే ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు 2023–24 లో రూ.5,512.50 కోట్లు, తాజా బడ్జెట్(2025–26) లోరూ.5,936 కోట్లను కేంద్రం కేటాయించింది.