- రామప్ప, జోగుళాంబ, భద్రాచలం గుడులకు నిధులు మంజూరు చేసిన కేంద్రం
- తాజాగా వేములవాడ గుడి ఎంపిక
- కలెక్టర్ అకౌంట్‌లో ఫండ్స్ డిపాజిట్
హైదరాబాద్, వెలుగు: దేవాలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రసాద్ స్కీంలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రముఖ ఆలయాలను ఎంపిక చేసి రూ.143 కోట్లు ఇచ్చింది. రామప్పలోని రామలింగేశ్వరాలయం, అలంపూర్ జోగుళాంబ, భద్రాచలం ఆలయాలకు నిధులు విడుదల చేసింది. అలాగే, వేములవాడ టెంపుల్‌ను కూడా ప్రసాద్ స్కీంలో ఎంపిక చేసింది. రాష్ట్రంలో మరికొన్ని ఆలయాలను ఈ పథకంలో ఎంపిక చేసి నిధులు మంజూరు చేయాలని కోరుతూ దేవాదాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ఆలయాలను ఎంపిక చేసి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కేంద్రానికి పంపిస్తుంది. కేంద్రం పరిశీలించి ప్రసాద్ స్కీంలో ఆలయాలను ఎంపిక చేసి నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులను నేరుగా కలెక్టర్ అకౌంట్లో జమచేస్తుంది. ఆలయాల్లో చేపట్టాల్సిన పనులు, ఏ పనులకు ఎంత కేటాయించాలో ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తారు. ఎంపిక చేసిన పనులకు కలెక్టర్.. విడతల వారీగా నిధులు మంజూరు చేస్తారు. పనులు కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతాయి. భద్రాచలం ఆలయానికి రూ.61 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపగా.. రూ.41.38 కోట్లు, జోగుళాంబ ఆలయానికి రూ.80 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. రూ.36.73 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. రామప్ప ఆలయానికి తీర్థయాత్ర, వారసత్వ పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.62 కోట్లు కేటాయించింది.
తాజాగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ప్రసాద్ స్కీంలో ఎంపికైంది. ఈ ఆలయానికీ త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే కేంద్ర బృందం ఆలయాన్ని సందర్శించింది. చేపట్టాల్సిన పనులపై నివేదికలు రూపొందించి కేంద్రానికి అందజేసింది. ఈ పథకంలో కేటాయించిన నిధులతో ఆలయాల్లో అభివృద్ధి పనులు, భక్తులకు సౌకర్యాలు కల్పించనున్నారు. అతిథి గృహాలు, అన్నప్రసాద భవనాలు, క్యూ కాంప్లెక్స్‌లు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
స్వదేశ్ దర్శన్‌లో బల్కంపేట, భువనగిరి కోట
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ కింద కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. ఇందులో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, భువనగిరి కోటలను ఎంపిక చేసింది. ఈ ఆలయ ప్రాంగణంలో రూ.4.4 కోట్లతో అన్నదానం భవనం, వర్షపు నీటి సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థ, బయో టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్, గేట్లు, సీసీ టీవీలు, ఫోకస్ లైట్లు, డీజీ సెట్, కెఫెటేరియా తదితర వసతులకు నిధులు కేటాయించనున్నది. భువనగిరి కోటకు సరికొత్త అందాలు సంతరించుకునేలా రూ.56.81 కోట్లతో గైడెడ్ టూర్లు, లైట్ షోలు, రోప్ వే, ఇంటర్- ప్రిటేషన్ సెంటర్ సౌకర్యాలు కల్పించనుంది. రూ.38 కోట్లతో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయనుంది.