- వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి
- నష్టంలో 4 శాతమే విదిల్చిన మోదీ సర్కారు
- తక్కువ నష్టం అంచనా రిపోర్ట్ ఇచ్చినా ఏపీకి 1,036 కోట్లు
- కేంద్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ రైతులు నారాజ్
హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తగా నష్టపరిహారం కింద కేంద్ర సర్కారు ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి రూ. 416 కోట్లు మాత్రమే విదిల్చింది. ఇటీవల వరదలకు రాష్ట్రంలో రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లింది. తక్షణ సాయం కింద రూ.2 వేల కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అభ్యర్థించారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు, ఆ తర్వాత వచ్చిన కేంద్ర బృందానికి నష్టం అంచనా వివరాలను పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఏపీలోనూ భారీ నష్టం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయని, అందుకే ఏపీలాగానే తెలంగాణకూ సాయం అందించాలని సీఎం కోరారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని అన్నారు. అయితే.. ఇవేమీ పట్టని కేంద్రం.. తన కూటమి పార్టీ అధికారంలో ఉన్న ఏపీకి రూ.1,036 కోట్లు రిలీజ్ చేసింది. తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపింది. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్ నిధులతో ఒక్క ఇరిగేషన్డిపార్ట్మెంట్లోని నష్టాన్ని మాత్రమే పూడ్చగలమని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. కేవలం ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్ల నష్టమే రూ.7,693 కోట్లుగా ఉన్నదని అంటున్నారు. కాగా, కేంద్ర సర్కారు తీరుతో రాష్ట్ర రైతులు నారాజ్అవుతున్నారు.
14 రాష్ట్రాలకు సహాయ నిధి రిలీజ్
కేంద్రం మొత్తం 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్ల సహాయ నిధి రిలీజ్ చేసింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్‌ఎఫ్) నుంచి కేంద్ర వాటాగా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎన్డీఆర్‌ఎఫ్) నుంచి అడ్వాన్స్‌గా ఈ నిధుల్ని విడుదల చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం నిధుల కేటాయింపునకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటీవల దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.
ఇందులో ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ. 416 కోట్లను హోం మంత్రిత్వ శాఖ కేటాయించింది. అలాగే, మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బిహార్‌కు రూ.655.60 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు, మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.468 కోట్లు సహాయనిధిగా కేంద్రం విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.
కాగా, భారీ వరదలతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే చాలా జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అలాగే, తెలంగాణ, ఏపీతోపాటు వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, మిజోరం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు (ఐఎంసీటీ) క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడికక్కడే నష్టపరిహారాన్ని అంచనా వేశాయి. ఈ అంచానాలను కేంద్ర హోంశాఖకు పంపాయి. తాజాగా, వరదల వల్ల ప్రభావితమైన బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు త్వరలోనే కేంద్ర బృందాలు పంపనున్నట్టు కేంద్రం వెల్లడించింది.