న్యూఢిల్లీ: దేశంలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 2024–25 మధ్యంతర బడ్జెట్లో రూ.24,931 కోట్లు కేటాయించింది. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం రూ.1,300 కోట్లు అలాట్ చేసింది. అర్బన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మధ్యతరగతి వేగంగా విస్తరిస్తోందని, అర్బనైజేషన్ ఫాస్ట్‌గా పెరుగుతోందని.. దేశంలోని వివిధ మెట్రో లలో ప్రతి రోజు కోటి మంది ప్రయాణిస్తున్నారని ఆమె చెప్పారు.
పెరుగుతున్న అర్బనైజేషన్‌కు మెట్రో లు, నమో భారత్ రైళ్లు ఉత్ప్రేరకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, మెట్రో ప్రాజెక్టులకు గత బడ్జెట్లో రూ.23,175 కేటాయించగా ప్రస్తుతం 7.57 శాతం నిధులు పెంచినట్లు చెప్పారు. బడ్జెట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కోసం రూ. 26,170 కోట్లు కేటాయించారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.5,000 కోట్లు కేటాయించారు. పీఎం-ఈబస్ సేవా పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు రూ.1,300 కోట్లు కేటాయించారు.
ఈ స్కీమ్ కింద ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో 169 సిటీలకు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు అందివ్వనున్నారు. 2037 వరకు కొనసాగే ఈ స్కీమ్‌కు మొత్తం రూ.57,613 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం గతంలో తెలిపింది. ఇందులో రూ.20 వేల కోట్లు కేంద్రం, మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు భరిస్తాయి.