బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదు

బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదు

 

  • లోక్​సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు అవకాశం లేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం లోక్ సభలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్​కు ముడి ఇనుము నిల్వల కేటాయింపు అంశాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేవనెత్తారు. ఈ ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

తెలంగాణలోని మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలలో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఎండీసీఎల్)కు ఎలాంటి ముడి ఇనుము, ఖనిజ నిల్వలు కేటాయించలేదని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వీలుగా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్​కు 65.20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుము, ఖనిజ నిల్వల కోసం 2019లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ఉక్కు శాఖతో పాటు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ పరిశీలించాయని తెలిపారు.

ఈ పరిశీలనలో తెలంగాణలో సెయిల్ ఆధ్వర్యంలో సమీకృత స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని పరిశీలనలో స్పష్టమైందని చెప్పారు. ముడి ఇనుము, ఖనిజ ఏరియాను రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను 2021లో రాష్ట్రానికి తిరిగి పంపించినట్లు సమాధానం చెప్పారు. కాగా.. ఏపీ విభజన చట్టం 2014లో పొందుపరిచినట్లు తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఏడాది కింద సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరారు. అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారు. అయితే.. ఎంపీ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు మరోసారి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం విముఖతనే చూపింది.