ఢిల్లీ: జన గణనకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. 2025లో జనగణనను ప్రారంభించాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2025లో మొదలై 2026 వరకూ జన గణన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు.. దేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2028 నాటికి లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించినట్లు పేర్కొన్నాయి.
మన దేశంలో జన గణన ప్రక్రియ ప్రతీ పదేళ్లకొకసారి జరుగుతుంది. చివరిగా.. 2011లో దేశ జనాభాను లెక్కించారు. 2011లో జరిగిన జనాభా లెక్కలు ఇతర సర్వేల ద్వారా దేశంలో సుమారు 41% ఓబీసీలు, 19.59% షెడ్యూల్డ్ కులాలు, 8.63% షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు 30.8% ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇతరులుగా పేర్కొన్న 30% లో ఓసీల సంఖ్యను కూడా జత చేయడం జరిగింది.
Also Read:-ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి బంగారం ఇచ్చాడు..!
2021లో జన గణన జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. దాదాపు నాలుగేళ్లు ఆలస్యంగా 2025లో జన గణన ప్రక్రియ మొదలుకానుంది. ప్రపంచ దేశాల్లోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చెప్పుకునే చైనాను ఇండియా అధిగమించిందని.. జనాభాలో ఇండియా నెంబర్.1 స్థానంలో ఉందని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సంగతి తెలిసిందే. యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం.. ప్రస్తుతం భారత జనాభా 145 కోట్ల పైమాటే. జనాభా గణన ఆధారంగా ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు, చట్టసభల ప్రాతినిధ్యం అను కీలక అంశాలు ముడిపడి ఉన్నాయి.
అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్లూప్రింట్ ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సర్వ శిక్ష అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం వంటి పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన అనగా రహదారులు పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణంకు జనాభా లెక్కలు తప్పనిసరి. 2026 జనాభా లెక్కల తర్వాత జరగనున్న డీలిమిటేషన్ అనంతరం భారత పార్లమెంటులో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుందని సమాచారం. లోక్‌సభలో ప్రస్తుత 543 స్థానాల నుంచి దాదాపు 888 స్థానాలకు పెరుగుతుందని అంచనా. రాజ్యసభలో కూడా సంఖ్యాబలం ప్రస్తుత 245 నుంచి దాదాపు 384 సీట్లకు పెరగనుందని భావిస్తున్నారు.