న్యూఢిల్లీ : నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ను రద్దు చేయలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. నీట్ పేపర్ లీకైనట్లు ఎలాంటి ఆధారాలు లేవు..నీట్ పరీక్ష రద్దు చేస్తే నిజాయితీ గల అభ్యర్థులకు నష్టం కలుగుతుందని..మొత్తం పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధమైనది కాదని అఫిడవిట్ లో తెలిపింది. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం నిబ ద్ధతతో పనిచేస్తున్నామని కోర్టుకు తెలిపింది.
సోమవారం (జూలై 8) నీట్ యూజీ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారించనున్న క్రమంలో శుక్రవారం (జూలై 5) న కేంద్రం అఫిడవిట్ ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. పరీక్ష రద్దు చేయ డం వల్ల లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కేంద్రం తెలిపింది. పరీక్షలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి నట్లు రుజువులు లేనందు... పరీక్షల రద్దు సరికాదని వాదించింది.
నీట్ పరీక్షల పేపర్ లీక్, అవకతవకలపై ఆరోపణలు వస్తున్న క్రమంలో సమగ్ర దర్యాప్తు జరపాలని సీబీఐని కోరామని, అన్ని పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.