
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై విరుచుకుపడ్డారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)ని విచ్ఛిన్నం చేయడంపై మోడీ సర్కార్ దృష్టి పెట్టిందని అబ్దుల్లా ఆరోపించారు. ప్రస్తుతం పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నిర్బంధంలో ఉన్నందున పీడీపీ విచ్ఛిన్నానికి యత్నాలు జరుగుతున్నాయని కొత్తగా రిలీజైన పుస్తకంలో అబ్దుల్లా కామెంట్స్ చేశారు. గతేడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్‌ఎస్‌ఏ), 1980 కింద మెహబూబాను నిర్బంధంలో ఉంచారు.
‘ప్రస్తుత తరుణంలో న్యూఢిల్లీ ఫోకస్ మొత్తం పీడీపీని విచ్ఛిన్నం చేయడంపైనే కేంద్రీకృతమైనట్లు కనిపిస్తోంది. అందుకే పీడీపీకి చెందిన నేతల్లో అప్నీ పార్టీ (మన పార్టీ) లాంటి రాజకీయ నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. నా కంటే ఎక్కువ కాలం మెహబూబాను నిర్బంధంలో ఉంచారు. ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో నేతలను విడగొట్టినంత సులువుగా పీడీపీని విచ్ఛిన్నం చేయలేకపోతున్నారు’ అని అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 24న అబ్దుల్లాను ఏడు నెలల నిర్బంధం తర్వాత రిలీజ్ చేశారు. యూఎస్‌కు చెందిన ప్రదీప్ చిబ్బర్, హర్ష్ షా రాసిన బుక్‌కు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ప్రభుత్వంపై ఒమర్ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా టుమారో: కన్వర్జేషన్స్ విత్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్’ అనే ఈ పుస్తకంలో ఒమర్ కామెంట్స్‌ను చేర్చారు. ఈ బుక్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలోనే కాంగ్రెస్‌కు గాంధీయేతర నేత ప్రెసిడెంట్‌గా ఉండాలని రాహుల్ గాంధీ చెప్పిన సంగతి తెలిసిందే.