
గాంధీనగర్ : ఎల్ ఓసీ వెంబడి చైనాతో బార్డర్ వివాదం కొనసాగుతున్న వేళ.. మరోసారి అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ఆ దేశం కొత్తగా పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కవ్వింపు చర్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. డ్రాగన్ తీరును తీవ్రంగా ఖండిస్తూ.. పేర్లు పెట్టినంత మాత్రాన వాస్తవాలు మారవని బదులిచ్చారు. గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జై శంకర్.. "నేనొచ్చి మీ ఇంటి పేరు మారిస్తే.. ఆ ఇల్లు నాదవుతుందా..? అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. పేర్లు మార్చడం లాంటి చర్యలతో ఎలాంటి ప్రభావం ఉండదు. ఎల్ ఓసీ వద్ద మన సైన్యం ఉంది" అని స్పష్టం చేశారు. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా వాదిస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలోని 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని 'గ్లోబల్ టైమ్స్' కథనం పేర్కొంది