- పీఎల్‌ఐ కింద రూ.53,500 కోట్ల పెట్టుబడుల
- రూ. 2,874.71 కోట్ల రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ పెద్ద సక్సెస్ అయ్యింది. కిందటేడాది డిసెంబర్ నాటికి 14 సెక్టార్లలో ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసేందుకు 717 అప్లికేషన్లు వచ్చాయి. ఈ కంపెనీలు రూ.2.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయని అంచనావేయగా, రూ.53,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఇన్వెస్ట్‌మెంట్లతో తయారీ (లేదా సేల్స్) విలువ రూ.5 లక్షల కోట్లు పెరగగా, కొత్తగా 3 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి.
ఈ ఏడాది మార్చి 31 నాటికి అర్హత పొందిన కంపెనీలకు రూ.2,874.71 కోట్ల పీఎల్‌ఐ రాయితీలను పంపిణీ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మెజార్టీ బెనిఫిట్స్ ఎలక్ట్రానిక్స్, టెలికం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ఎనిమిది సెక్టార్లలోని కంపెనీలకు వెళ్లాయని వెల్లడించింది. పీఎల్‌ఐ కింద వచ్చిన ప్రాజెక్ట్‌లు మరింతగా విస్తరించడానికి రానున్న రెండు నుంచి మూడేళ్లు చాలా కీలకమని అన్నారు. కాగా, కరోనా టైమ్‌లో 14 సెక్టార్లలో పీఎల్‌ఐ స్కీమ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ‘పీఎల్‌ఐ స్కీమ్ మొదలు పెట్టినప్పుడు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం లేదు. ఏ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా దారి మళ్లలేదు.
2023–24 లో ఇన్వెస్ట్‌మెంట్ల ఇన్‌ఫ్లో కొనసాగుతుందని అంచనావేస్తున్నాం’ అని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) అడిషనల్ సెక్రెటరీ రాజీవ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ‘ రూ.3,420.5 కోట్ల విలువైన ఇన్సెంటివ్‌ల కోసం ఎనిమిది సెక్టార్ల నుంచి క్లయిమ్స్ వచ్చాయి. వీటిలో రూ.2,800 కోట్లను ఇప్పటికే డిస్‌బర్స్ చేశాం’ అని వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఎక్కువగా రూ.1,649 కోట్లు డిస్‌బర్స్ చేశామని, ఫార్మాకి రూ.652 కోట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్‌కు రూ.486 కోట్ల రాయితీలు ఇచ్చామని వివరించారు.