మునుగోడు బైపోల్ ఫలితాల వెల్లడిలో సీఈవో వైఖరి అనుమానాస్పదం : బీజేపీ

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప సీఈవో రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయలేదని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించలేదని విమర్శించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదన్నారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ చెప్పారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్ లోడ్ చేసినట్టు తెలుస్తోంది.